మరీ ఆనాటి తప్పుల సంగతేంటి, గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలపై హోం మంత్రి వనిత కౌంటర్
వైసీపీ ఎంపీ గోరంట్ల మాదవ్ న్యూడ్ వీడియో కాల్‌పై దుమారం సెగలు రేపుతోంది. అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఎంపీ మాదవ్‌ను కాపాడుతున్న విధంగా మాట్లాడటం సరికాదని సూచించారు. టీడీపీ మహిళా నేతలు తీరు మార్చుకోవాలని కోరారు. వారు వాడే పదజాలం ఇబ్బంది కరంగా ఉందన్నారు.
ఈ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీఎం జగన్ మూడేళ్ల పాలన పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉండడం ఓర్వలేక ఇలాంటి బురద చల్లే కార్యక్రమాలకు దిగుతున్నారని ఆరోపించారు. విమర్శించడానికి ఏ కారణాలు దొరక్క ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని అన్నారు. మాధవ్ విషయంలో వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపామని, అది నిజమని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓ మహిళా అధికారిని జుట్టు పట్టుకుని ఈడ్చి కొడితే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమెకు మీ ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయలేదని వనిత అడిగారు. ఆనాడు మీ క్యాబినెట్‌లో ఉన్న మంత్రి రావెల కిశోర్ బాబుపై ఓ ముస్లిం మహిళ వేధింపుల ఆరోపణలు చేస్తే ఏ చర్యలు తీసుకున్నారు? మంత్రి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఏడుస్తూ మీడియా ముందుకు వచ్చింది. ఆమెకు ఏం న్యాయం జరిగిందని అడిగారు.
ఆనాడు విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై బుద్ధా వెంకన్న ఏం చెబుతారు? మహిళలకు అప్పులు ఇచ్చి అప్పు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలను వ్యభిచారంలోకి దింపారు. అనాడు మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది? " అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గోరంట్ల మాధవ్ అంశంలో విచారణ అనంతరం వచ్చే నివేదికను బట్టే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications