పది, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం.. ఇతర రాష్ట్రాలతో సంబంధం లేదు: సురేశ్
రాష్ట్రంలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇంటర్, పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంటర్, పది పరీక్షలను కూడా విపక్షం రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు. ఎప్పుడూ ఇంతేనని.. వారి తీరు మాత్రం మారడం లేదని చెప్పారు. ఆపత్కాలంలో కూడా ఇలా వ్యవహరించడం తగదన్నారు.
Recommended Video
పరీక్షలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే.. మనమూ చేయాలా? అని ఆదిమూలపు ప్రశ్నించారు. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా? అని నిలదీశారు. ఏపీలో పదో తరగతి పరీక్షలపై జులైలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి జూన్ 7 నుంచి పది పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా ఉద్ధృతంగా ఉండటంతో వాయిదా వేశారు.

ఇంటర్ పరీక్షలను ఆగస్టులో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. పరీక్షల తేదీకి 15 రోజుల ముందు ప్రకటన చేస్తామని మంత్రి ఆదిమూలపు ఇప్పటికే తెలిపారు. గతేడాది మాత్రం ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి పక్కా నిర్వహిస్తామని చెబుతున్నారు. దీంతో నిజంగా నిర్వహిస్తారా లేదా.. పాస్ చేస్తారా అనే ప్రశ్న వస్తోంది. దీనిపై ప్రభుత్వం మాత్రం నిర్వహించేందుకే మొగ్గు చూపుతోంది. అప్పటివరకు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలీ మరీ.
ఇటు కరోనా విజృంభించడంతో సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎగ్జామ్స్ నిర్వహించకుండానే ప్రమోట్ చేసింది. 12వ తరగతి వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో వెనక్కి తగ్గింది. వారిని కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా వారి ఫలితాలను ప్రకటిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెబుతోంది.












Click it and Unblock the Notifications