ఏపీలో 10 లక్షలు: 11వేలకుపైగా కొత్త కేసులు, చిత్తూరులో కరోనా కల్లోలం, మరో 4 జిల్లాల్లోనూ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. సెకండ్ వేవ్‌లో తొలిసారి గురువారం పది వేలకుపైగా కేసులు నమోదు కాగా, శుక్రవారం 11 వేలను దాటగడం ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 45,581 నమూనాలను పరీక్షించగా.. 11,766 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 11,766 కరోనా కేసులు, 38 మరణాలు
తాజాగా నమోదైన 11,766 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,09,228కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 38 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, విశాఖపట్నంలో ముగ్గరు, గుంటూరు, విజయవాడలో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7579కి చేరింది.

ఏపీలో 70వేలకుపైగా యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 4441 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 9,27,418కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు భారీగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 75,231 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,58,80,750 కరోనా నమూనాలను పరీక్షించారు.

చిత్తూరు, గుంటూరులో కరోనా కల్లోలం..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 1885 కరోనా కేసులు నమోదు కాగా, గుంటూరులో 1593 నమోదయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తక్కువగా 190 కరోనా కేసులు నమోదయ్యాయి. మిగితా అన్ని జిల్లాల్లోనూ 300కుపైగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.

ఏపీలో జిల్లాల వారీగా భారీగా కొత్త కరోనా కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 1201, చిత్తూరులో 1885, తూర్పుగోదావరిలో 796, గుంటూరులో 1593, కడపలో 361, కృష్ణాలో 831, కర్నూలులో 1180, నెల్లూరులో 949, ప్రకాశంలో 370, శ్రీకాకుళంలో 1052, విశాఖపట్నంలో 910, విజయనగరంలో 448, పశ్చిమగోదావరిలో 190 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు ఆంక్షలకు ఉపక్రమించింది. శనివారం నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా వేటికీ అనుమతి లేదు. కాగా, మాస్కులు ధరించకుంటే రూ. 100 జరిమానా విధించాలని ఏపీ సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇక ఏపిలో 18ఏళ్లు దాటిన వారందరికీ ఉచితంగానే వ్యాక్సిన్ వేయనున్నట్లు ఏపీ సర్కారు ప్రకటించింది.












Click it and Unblock the Notifications