టెన్షన్ టెన్షన్.. శ్రీశైలంలో భారీ కొండచిలువ హల్ చల్ !!!
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సుమారు 12 అడుగుల పొడవు ఉన్న ఈ కొండచిలువ.. సుండిపెంట గ్రామంలోని అయ్యప్పస్వామి గుడి సమీపంలో ఒక నివాస గృహం కాంపౌండ్ గోడ పక్కన కనిపించింది. రాత్రి 10 గంటల సమయంలో దీన్ని గమనించిన గ్రామస్తులు.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
కాగా అటవీశాఖ అధికారులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ రమేష్ తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రమేష్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద కొండచిలువకు ఎలాంటి గాయాలు చేయకుండా పట్టుకున్నారు. ఆ తరువాత కొండచిలువను సురక్షితంగా సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కొండచిలువను సురక్షితంగా రక్షించినందుకు స్నేక్ క్యాచర్ రమేష్‌ను స్థానికులు అభినందించారు.

కాగా ఇటీవలి శ్రీశైలం పరిసరాల్లో ఈ తరహా ఘటనలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అఖిలేశ్వరాలయం దగ్గర 10 అడుగుల కొండచిలువను కూడా పట్టుకున్నారు. ఇప్పుడు సుండిపెంటలో కనిపించడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీశాఖ అధికారులు దీనిని సాధారణ ఘటనగానే పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతానికి అతి సమీపంగా ఉండటం, వర్షాకాలం తర్వాత వాతావరణ మార్పులు, ఆహారం కోసం కొండచిలువలు అప్పుడప్పుడు గ్రామాల వైపు రావడం సహజమేనని వివరించారు.
గత సెప్టెంబర్ లో శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ సమీపంలో 9 అడుగుల కొండచిలువను సిబ్బంది పట్టుకున్నారు. ఆగస్టులో డోర్నాల మండలం తడ్పాల గ్రామంలో గోదావరి పామును గుర్తించి రక్షించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో అటవీ అధికారులు సుండిపెంట గ్రామ ప్రజలకు పరిసర ప్రాంతాల వారికి ముఖ్య సూచనలు జారీ చేశారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. పాములు లేదా అడవి జంతువులు గమనించినప్పుడు వెంటనే హెల్ప్‌లైన్ 1800-425-5365కు కాల్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications