ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 1400పైనే: తగ్గిన రికవరీ, పెరిగిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా భారీగా తగ్గినట్లు కనిపించినా.. మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా, 1500కు చేరువలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 62,856 నమూనాలను పరీక్షించగా.. 1439 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1439 కరోనా కేసులు, 14 మంది మృతి
తాజాగా నమోదైన 1439 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,26,042కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 14 మంది మృతి చెందారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో నలుగురు మరణించగా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,964కి పెరిగింది.

ఏపీలో 14,624 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1311 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,97,454కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం 14,624 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,71,61,870 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 261 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు చొప్పున నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 23, చిత్తూరులో 261, తూర్పుగోదావరిలో 170, గుంటూరులో 142, కడపలో 66, కృష్ణాలో 131, కర్నూలులో 08, నెల్లూరులో 160, ప్రకాశంలో 87, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 79, విజయనగరంలో 08, పశ్చిమగోదావరిలో 182 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,87,320, చిత్తూరులో 2,40,063 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,565) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మళ్లీ 40,000 దాటి కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం తాజాగా 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో రోజువారీ కరోనా కేసులు14 శాతానికి పైగా పెరిగాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో 338 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దేశంలో యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.19 శాతంగా ఉన్నాయి. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కారణంగా 4,41, 749 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 40, 567 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. రోజువారి నమోదైన కేసుల తో పోలిస్తే, నమోదైన రికవరీలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3.23 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రికవరీ రేటు 97.48 శాతం గా ఉంది. అటు కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులు మళ్లీ నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,93,614 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక క్రియాశీల కేసులో రేటు 1.19% గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 2.38 శాతంగా ఉంది. ఇది చాలా కాలంగా మూడు శాతం కంటే తక్కువగా నమోదవుతుంది. గత 24 గంటల్లో కేరళలో 30,196 కేసులు మరియు 181 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసులలో కేరళ రాష్ట్రంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,71,295 నమూనాలను పరీక్షించిన తర్వాత, పాజిటివిటీ రేటు బుధవారం 17.63 శాతానికి పెరిగింది.












Click it and Unblock the Notifications