తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం- ఒకేరోజు: వారికి అనుమతి లేదు
Tirumala: తిరుమలలో అరుదుగా సందర్భం చోటు చేసుకోనుంది. రెండు మహోత్సవాలు ఒకేరోజు కలిసి రానున్నాయి. ఇందులో పాల్గొనే అవకాశం అశేష భక్తజనానికి కలిగింది. ఈ రెండింటినీ విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు.
ఆ రెండు పండుగలు ఇవే..
బుధవారం నాడు అంటే ఈ నెల 12వ తేదిన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవం జరుగనుంది. అదే రోజున పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అధికారులు కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఈ రెండూ ఒకేరోజున కలిసి రావడాన్ని అరుదైన, విశేష సందర్భంగా భావిస్తారు భక్తులు.

అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో
తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థోత్సవాలలో ఒకటి రామకృష్ణతీర్థ ముక్కోటి. శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షలను సైతం ఇదివరకే నిర్వహించారు కూడా. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది.
తెల్లవారు జామున 5 గంటల నుండి ..
బుధవారం సాయంత్రం తెల్లవారు జామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. అక్కడ భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.
వారికి అనుమతి లేదు..
భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, మంచినీటి వసతిని కల్పించనున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మెడికల్ క్యాంప్‌లను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించనున్నారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించరు.

పౌర్ణమి గరుడ సేవ..
అదే రోజున పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు.












Click it and Unblock the Notifications