ఉలిక్కి పడ్డ ఏపీ: వియత్నాం మృతుల్లో ఏపీ, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు?: నారా లోకేష్ చర్యలు
వియత్నాంలో ఘోర ప్రమాదం సంభవించింది. పర్యాటకులకు స్వర్గధామం ఫు కువక్ (Phu Quoc) ద్వీపం సమీపంలో భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. ఆ సమయంలో పడవలో దాదాపు 32 మంది పర్యాటకులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. వారందరూ గల్లంతయ్యారు. వారిలో 18 మంది మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. మిగిలిన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ప్రమాదాన్ని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎక్స్ ఓ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పర్యాటకుల ఆచూకీ కనుగొనడానికి స్థానిక వియత్నాం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రయాణికుల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.

ప్రమాదానికి గురైన వారి వివరాలు, అత్యవసర సహాయం కోసం బాధితుల కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూమ్ +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, హనోయ్ కంట్రోల్ రూమ్ +84 91 308 9165 ద్వారా తమను సంప్రదించాలని సూచించారు. పడవ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వాతావరణంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న మార్పులా లేక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తోన్నారు.
ప్రమాదం బారిన పడిన వారిలో భారత్ నుంచి వెళ్లిన ఓ మొబైల్ కంపెనీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. 250 మంది డిస్ట్రిబ్యూటర్లను సంబంధిత కంపెనీ వియత్నాం తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. వీరిలో 35 మంది ఏపీ, 40 మంది తెలంగాణకు చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వారందరూ కూడా మొత్తం మూడు బోట్లల్లో విహారానికి వెళ్లారని, అందులో ఒకటి ప్రమాదానికి గురైందని సమాచారం.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం ఉలిక్కి పడింది. ప్రమాద వివరాలను సేకరిస్తోంది. దీనిపై ఎన్నారై సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో ఏపీకి చెందిన ఎంతమంది మరణించారనే దానిపై వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. ఢిల్లీ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తోన్నట్లు తెలిపారు. అక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు.
మరోవంక.. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో మాట్లాడరు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన వారు ప్రాణాపాయంలో చిక్కుకున్నారన్న సమాచారంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నట్లు వారు నారా లోకేష్ కు వివరించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని బాధితులకు సహాయం అందించాలని సూచించారు.












Click it and Unblock the Notifications