ఏపీలో మళ్లీ 20వేలకుపైగా కరోనా కేసులు: 2 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో 20వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 90,750 నమూనాలను పరీక్షించగా.. 21,452 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 21,452 కరోనా కేసులు, 89 మరణాలు
తాజాగా నమోదైన 21,452 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,44,386కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 89 మంది మృతి చెందారు. అత్యధికంగా విశాఖపట్నంలో 11 మంది మృతి చెందగా, తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో 9 మంది చొప్పున, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,988కి చేరింది.

ఏపీలో 2లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 19,095 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 11,38,028కి చేరింది. కోలుకుంటున్నవారి కంటే కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు అధికంగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల్లో అత్యధిక పెరుగుదల నమోదవుతువుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,97,370 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,76,05,687 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2927 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరంలో 693 మంది కరోనా బారినపడ్డారు.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 2185, చిత్తూరులో 1908, తూర్పుగోదావరిలో 2927, గుంటూరులో 1836, కడపలో 1746, కృష్ణాలో 997, కర్నూలులో 1524, నెల్లూరులో 1689, ప్రకాశంలో 1192, శ్రీకాకుళంలో 1285, విశాఖపట్నంలో 2238, విజయనగరంలో 693, పశ్చిమగోదావరిలో 1232 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేస్తోంది.ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో 45ఏళ్లకుపైబడినవారికి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. తాజాగా, 2 లక్షల కోవాగ్జిన్ టీకాలు ఏపీకి చేరుకున్నాయి.












Click it and Unblock the Notifications