ఏపీలో కరోనా విలయం: 23వేలకుపైగా కేసులు, 100కుపైగా మరణాలు, 2లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. కొత్తగా 23వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేగాక,
కరోనా మహమ్మారి బారినపడి వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,01,330 నమూనాలను పరీక్షించగా.. 23,160 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 23,160 కరోనా కేసులు, 104 మరణాలు
తాజాగా నమోదైన 23,160 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 106 మంది మృతి చెందారు. అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 17 మంది కరోనాతో మరణించారు. విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో 11 మంది చొప్పున, విజయనగరం, తూర్పుగోదవరి జిల్లాల్లో 9 మంది చొప్పున, అనంతపురం, చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో 8 మంది చొప్పున, గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 9686కు చేరింది.

ఏపీలో 2లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 24,819 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 12,79,110కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య స్వల్పంగా పెరగడం గమనార్హం. రాష్ట్రంలో ప్రస్తుతం 2,09,736 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,82,41,637 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3528 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 945 మంది కరోనా బారినపడ్డారు. ఒక్క విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 2334, చిత్తూరులో 2670, తూర్పుగోదావరిలో 3528, గుంటూరులో 1501, కడపలో 1221, కృష్ణాలో 1496, కర్నూలులో 1310, నెల్లూరులో 1239, ప్రకాశంలో 1590, శ్రీకాకుళంలో 1440, విశాఖపట్నంలో 2007, విజయనగరంలో 945, పశ్చిమగోదావరిలో 1879 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కఠిన ఆంక్షలను విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతిస్తున్నారు. వాహనాల రాకపోకలు కూడా 12 గంటలవరకే అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications