ఉపాధి హామీ పథకం పేరుతో 250 కోట్ల స్కాం - డిప్యూటీ సీఎం పవన్
వైసీపీ హయాంలో ఉపాధి హామీ పథకంలో భారీగా అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం రూ.250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లభించలేదని.. 75 లక్షల పైచిలుకు నిధులు రికవరీ చేశామన్నారు.
శాసనసభ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత ఉపాధి హామీ పథకం అవినీతిపై పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలోనే స్కీంలో అవినీతి ఇష్యూ ? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటూ లేవనెత్తారు. దీంతో పంచాయితీ రాజ్ శాఖమంత్రి పవన్ ఈ వ్యవహారంపై సుధీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని వెల్లడించారు.

ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇక ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరు లోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి, అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం జరిగినట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషించినట్టు తేలడంతో విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. 25 మండలాలకు గాను 16 మండలాల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని గుర్తుచేశారు.
ఇప్పటికీ పలు స్థాయిలో ఉన్న దాదాపు 520 మందిని గుర్తించామని.. వారిలో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు ఉన్నట్లు తేలిందన్నారు. మిగతా వారిపై విచారణ జరుగుతోందన్నారు. సోషల్ ఆడిట్, విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ స్థాయిలో సరైన అధికారులను నియమించామన్నారు పవన్.
అంతకు ముందు ఎమ్మెల్యే లోకం మాధవి మాట్లాడుతూ.. ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ముగ్గురు ఒక గ్రూపుగా ఏర్పడి కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడినట్టు సభ దృష్టికి తెచ్చారు. అలాగే జాబ్ కార్డు అవకతవకలు, సోషల్ ఆడిట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ నియోజకవర్గంలో కూడా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై శాఖపరమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications