ఎలాన్ మస్క్ ట్విట్టర్ నుంచి తరిమేస్తే..! AI స్టార్టప్ పెట్టి రెండేళ్లలో 2 బిలియన్ డాలర్లకు..!
2002లో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter)ను కొనుగోలు చేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా ట్విట్టర్ తో సంప్రదింపులు మొదలుపెట్టి, ఊహించని రేటు ఇచ్చి మరీ మస్క్ దాన్ని కొనేశారు. అంతే కాదు ట్విట్టర్ పేరు కాస్తా ఎక్స్ గా మార్చేశారు. అక్కడితో ఆగకుండా ట్విట్టర్ గా ఉన్న సమయంలో సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ (Parag Agarwal) ను సైతం ఆ పదవి నుంచి హఠాత్తుగా తప్పించేశారు. దీంతో ఐఐటీ బోంబే మాజీ విద్యార్ధి అయిన పరాగ్ వైదొలగక తప్పలేదు.
మస్క్ తీసుకున్న నిర్ణయంతో కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చినా నిరాశపడలేదు. ఆ తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా పరాగ్ అగర్వాల్ 'ప్యారలల్ వెబ్ సిస్టమ్స్' పేరుతో ఓ ఏఐ స్టార్టప్‌ను స్థాపించారు. అంతే కాదు కేవలం రెండేళ్లలోనే సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.17 వేల కోట్లు) విలువ కలిగిన ఏఐ స్టార్టప్ గా దాన్ని మార్చి సిలికాన్ వ్యాలీలో తన సత్తా చాటుతున్నారు. దీంతో ఇప్పుడు పరాగ్ అగర్వాల్ జీవితం ఇప్పుడు ఓ స్ఫూర్తిదాయక పాఠంగా మారిపోయింది.

మహారాష్ట్రకు చెందిన పరాగ్ అగర్వాల్ విద్యార్థి దశ నుంచే ప్రతిభావంతుడు. జేఈఈలో ఆల్ ఇండియా ర్యాంక్ 77 సాధించి ఐఐటీ బాంబే (IIT Bambay)లో కంప్యూటర్ సైన్స్ చదివారు. అనంతరం అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించారు. 2011లో ట్విట్టర్‌లో చేరిన పరాగ్ అగర్వాల్.. తనకున్న సాంకేతిక నైపుణ్యాలతో వేగంగా ఎదగడమే కాకుండా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. 2021లో జాక్ డోర్సీ స్థానంలో ట్విట్టర్ సీఈఓగా అవకాశం దక్కించుకున్న పరాగ్ కు 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన వెంటనే షాక్ తగిలింది. అప్పట్లో పరాగ్ తో పాటు ట్విట్టర్ లో పనిచేస్తున్న కీలక అధికారుల్ని మస్క్ తొలగించారు.

ఆ తర్వాత పరాగ్ ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ స్థాపించడమే కాకుండా.. ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్‌లో మరింత సమర్థవంతంగా సమాచారం సేకరించేందుకు అవసరమైన వెబ్ మౌలిక సదుపాయాలు, సెర్చ్ టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఇటీవల ఈ స్టార్టప్‌కు ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి 100 మిలియన్ డాలర్ల సిరీస్-బీ పెట్టుబడి లభించింది. దీంతో కంపెనీ విలువ ఏకంగా 2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాదు ఏఐ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ట్విట్టర్ సీఈఓ పదవి పోయిన తర్వాత నిరుత్సాహపడకుండా కొత్త అవకాశాన్ని సృష్టించుకున్న పరాగ్ అగర్వాల్ ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలంటే పట్టుదల, సాంకేతిక నైపుణ్యం, కొత్త ఆలోచనలు ఎంత ముఖ్యమో ఆయన మరోసారి నిరూపించారు.















Click it and Unblock the Notifications