ఏపీలో ఘోర ప్రమాదం: పంట కాలువలో పల్టీ కొట్టిన కారు
Konaseema: ఏపీలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో ఓ మహిళ, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ తెల్లవారు జామున ఈ దుర్ఘటన సంభవించింది. జిల్లాలోని పీ గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి విజయ్ కుమార్ తన భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రిషితో విశాఖపట్నం వెళ్లి, తిరిగి వస్తోండగా మార్గమధ్యలో వారు ప్రయాణిస్తోన్న స్విఫ్ట్ కారు ప్రమాదానికి గురైంది.

ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో చింతావారిపేట సమీపంలో అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఉమ, పెద్ద కుమారుడు మనోజ్, చిన్న కుమారుడు రిషి గల్లంతయ్యారు. ముందు సీటులో కూర్చున్న విజయ్ కుమార్ కారు ప్రాణాలతో బయటపడగలిగారు. డోర్ తీసుకొని నీటిలో నుంచి బయటకు రాగలిగారు.
సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన ఉమ, మనోజ్, రిషి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిద్రమత్తు, అతివేగం వల్ల ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తోన్నారు.
ఇటీవలే కురిసిన భారీ వర్షాల వల్ల పంట కాలువలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా ముగ్గురు కొట్టుకునిపోయి ఉంటారని అంచనా వేస్తోన్నారు. గల్లంతైన వారి కోసం ప్రమాద స్థల నుంచి దిగువకు స్థానికుల, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.












Click it and Unblock the Notifications