బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి, మృతదేహం తీస్తుంటే..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజుల క్రితం ఆమె బోరు బావిలో పడింది. అయితే, మూడు రోజుల నిరీక్షణ ఆవిరయింది. బోరు బావిలో మధ్యలో రాయి ఉండటం వల్ల ఇబ్బంది ఏర్పడిందని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు రోధించారు.
చిన్నారి మృతదేహం బోరు బావి నుండి తీసేందుకు మరికొంత సమయం పట్టనుంది. చిన్నారి మృతదేహాన్ని మంగళవారం బావి నుండి బయటకు తీస్తుండగా.. మళ్లీ బావిలో పడిపోయింది. మృతదేహాన్ని బయటకు తీసేందుకు మరో గొయ్యి తవ్వాలని మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. బోరు తవ్విన యజమాని సహా, బోరు వేసిన వారి పైన కేసులు పెట్టనున్నట్లు తెలిపారు.

కాగా, రంగారెడ్డి జిల్లా మంచాలలోని ఓ వ్యవసాయ పొలంలో నిరుపయోగంగా ఉన్న ఓ బోరు బావిలో నాలుగున్నరేళ్ల చిన్నారి గిరిజ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయిన విషయం తెలిసిందే. 40 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిన నాలుగేళ్ల చిన్నారిని వెలికి తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రానికి చెందిన మల్గ నాగయ్య తన పొలంలో కొన్ని నెలల క్రితం వేసిన బోరుబావిలో నీరు పడకపోవడంతో కేసింగ్ తీసి గోతిని పూడ్చివేయకుండా అలాగే వదిలేశాడు. ఆదివారం మల్గ ఎల్లమ్మ తన మనుమరాలు గిరిజ(5), మనుమడు చెర్రి(7)లను వెంటతీసుకుని వ్యవసాయ పొలానికి వచ్చి పత్తిచేనులో ఉన్న చెట్టుకింద చిన్నారులను కూర్చోబెట్టి తోటి మహిళలతో కలిసి పత్తితీసే పనిలో నిమగ్నమైంది.
ఈ క్రమంలో ఉదయం 11.30 గంటల సమయంలో గిరిజ తన అన్నతో ఆడుతూ పత్తిచేను మధ్యలోకి నడిచి వెళుతూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయింది. గిరిజ అన్న చెర్రి విషయం చెప్పడంతో, వారి మేనమామ శ్రీశైలం అధికారులకు సమాచారం అందించారు.
దీంతో, అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా గిరిజను రక్షించేందుకు శ్రమించారు. సోమవారం జాతీయ విపత్తు నిర్వహణ, సింగరేణి ప్రత్యేక సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.
బాలికను బయటకు తీసుకు రావడానికి బోరు గుంతకు సమాంతరంగా 46 అడుగుల లోతు వరకు భూమిని తవ్వారు. బోరు కింది భాగం నుండి తవ్విన గుంతకు రంధ్రం చేసేందుకు డ్రిల్లింగ్ యంత్రాలకు వినియోగించారు. అయితే నేలలో పెద్ద రాయి ఉండటంతో పనులకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో ప్రొక్లెయిన్లతో అయిదు అడుగుల లోతుకు తవ్వారు.












Click it and Unblock the Notifications