ఏపీలో కరోనా తగ్గుముఖం: పెరుగుతున్న రికవరీ, తగ్గుతున్న యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం పది రోజులుగా ఆరువేల కంటే తక్కువే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య తగ్గించనప్పటికీ కరోనా కేసులు మాత్రం భారీగా పెరగడం లేదు. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

ఏపీలో కొత్తగా 4622 కరోనా కేసులు, 35 మంది మృతి
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72,082 నమూనాలను పరీక్షించగా 4622 మందికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,63,573కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో కరోనా బారినపడి 35 మంది మరణించారు.

జిల్లాల వారీగా కరోనా మరణాలు
జిల్లాల వారీగా కరోనా మరణాలను గమనించినట్లయితే.. చిత్తూరులో ఏడుగురు, కృష్ణాలో ఐదుగురు, కడప, ప్రకాశం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6291కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కేసులు
ఇక జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 164, చిత్తూరులో 705, తూర్పుగోదావరి జిల్లాలో 691, గుంటూరులో 391, కడపలో 317, కృష్ణాలో 416, కర్నూలులో 88, నెల్లూరులో 228, ప్రకాశంలో 442, శ్రీకాకుళంలో 101, విశాఖపట్నంలో 168, విజయనగరంలో 159, పశ్చిమ గోదావరిలో 752 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో పెరుగుతున్న రికవరీ..
ఒక్క రోజు వ్యవదిలో 5715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,11,532కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,855 యాక్టివ్ కేసులున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 71 లక్షలు దాటాయి. యాక్టివ్ కేసులు 8,39,890 ఉన్నాయి. 62 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారినపడి లక్ష మందికిపైగా మరణించారు. అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఏపీ ఉంది.












Click it and Unblock the Notifications