ఏపీలో ఏడుమంది ప్రాణం తీసిన రోడ్లపై గుంతలు
East Godavari: ఏపీలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నాయిగూడెం చిలకవారి పాకల వద్ద అర్ధరాత్రి ఈ దుర్ఘటన సంభవించింది. జిల్లాలోని టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమల్ల వెళ్తోండగా మార్గమధ్యలో చిన్నాయిగూడెం వద్ద అదుపు తప్పింది.

ప్రమాద సమయంలో డీసీఎం లారీలో 11 మంది ఉన్నారు. వారిలో ఏడుమంది జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక మరణించారు. మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నరసింహ కిశోర్.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.
స్థానికులు సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ కూడా జంగారెడ్డిగూడేనికి చెందినవారిగా గుర్తించారు. కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల వల్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. వాటిని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పిందని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ జీ దేవకుమార్ వెల్లడించారు.
ఈ ఘటన పట్ల చంద్రబాబు, వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. వారికి అండగా ఉంటామని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications