తిరుమల ఇక కొత్తగా- సమూల మార్పు
Tirumala: దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో జే శ్యామలరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ప్రసంగించారు. తిరుమలలో మున్ముందు అమలు చేయదలిచిన అనేక కార్యక్రమాల గురించి వివరించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు సుమారు ఏడు లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం గుండా స్వామివారి దర్శనభాగ్యం కల్పించామని శ్యామలరావు వెల్లడించారు. దీనికోసం ముమ్మర ఏర్పాట్లు చేశామని అన్నారు.

గత ఏడాది అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవంబర్ 28 నుండి డిసెంబర్ 6 వరకు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని శ్యామలరావు చెప్పారు. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహనసేవల దర్శనం చేసుకున్నారని అన్నారు.
ఫిబ్రవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఈఓ తెలిపారు. అలాగే తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించబోతోన్నామని అన్నారు.
హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రయాగ రాజ్ వద్ద ఈ నెల 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశామని, విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారని వివరించారు.

తిరుమలను సమగ్రాభివృద్ధి చేయడానికి విజన్- 2047ను రూపొందించనున్నట్లు శ్యామలరావు తెలిపారు. దీనికోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీటీడీ అధికారులకు పలు సూచనలు చేశారని అన్నారు.
అలిపిరి బేస్ క్యాంప్, బహుళస్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్డుల నిర్మాణం, సబ్‌వేల నిర్మాణం, రామ్ భగీచ, బాలాజీ బస్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని శ్యామలరావు పేర్కొన్నారు.
భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించడానికి టీవీఎస్ మోటార్ సంస్థతో ఎంఓయూ చేసుకున్నామని, భక్తులకు అందించే లడ్డూ, అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నాణ్యమైన ముడిసరుకుల ఎంపికలో సూచనలు చేసేందుకు రిలయన్స్ రిటైల్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాలలో వినియోగించే నెయ్యి నాణ్యతను పూర్తి స్థాయిలో గుర్తించేలా అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను త్వరలో ప్రారంభిస్తున్నామని, దీనికోసం రూ.70 లక్షల విలువైన రెండు యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు విరాళంగా అందించిందని చెప్పారు.
టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దడానికి చర్యలు చేపట్టామని ఈఓ అన్నారు. గత ఏడాది డిసెంబరు 3వ తేదీ నుండి తిరుపతి స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications