ఈ సాయంత్రమే.. తిరుమలలో అద్భుత ఘట్టం: వెలిగిపోతున్న శ్రీవారి నిలయం
ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి తిరుమలలో వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఈ సాయంత్రం 7 నుండి రాత్రి 8 గంటల మధ్యలో అంకురార్పణ ఘట్టం జరుగనుంది. ఈ వైదిక క్రతువుతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. వైఖానస ఆగమ సాంప్రదాయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నారు టీటీడీ అర్చకులు. శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అంకురార్పణను శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.
ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ నిర్వహించడం అనేది ఆనవాయితీ. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు. శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీవిష్వక్సేనులవారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విష్వక్సేనుడు మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రతీతి.

నవధాన్యాలు మొలకెత్తడానికి అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భూసూక్తాన్ని పఠిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా మట్టికుండల్లో పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు.
ఇందులో గోధుమలు- సూర్యుడు, బియ్యం- చంద్రుడు, కందులు- కుజుడు, పెసలు- బుధుడు, శనగలు- బృహస్పతి, అలసందలు- శుక్రుడు, నువ్వులు- శని, మినుములు- రాహువు, ఉలవలు- కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.
ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.













Click it and Unblock the Notifications
