ప్రేమించాలంటూ ఎఎస్ఐ భార్యపై బ్లేడ్‌తో యువకుడి దాడి
విశాఖపట్నం: తనను ప్రేమించాలంటూ ఒక యువకుడు మూడు నెలలుగా ఒక ఏఎస్‌ఐ భార్య వెంట పడ్డాడు. దీనికి ఆమె నిరాకరించడమే కాకుండా తీవ్రంగా హెచ్చరించింది. దాంతో అతను ఆమెపై బ్లేడ్‌తో దాడి చేసి, తాను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.
స్వల్పంగా గాయపడిన వివాహిత ప్రాథమికచికిత్స తర్వాత ఇంటికి వెళ్లిపోగా తీవ్రగాయాలైన యువకుడు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.ఏఎస్‌ఐ కుటుంబం గోపాల పట్నంలో నివాసం వుంటున్నది. ఏఎస్‌ఐ భార్య తన కుమార్తెకు షటిల్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ ఇప్పించేందుకు బైక్‌పై రోజూ అక్కయ్యపాలెం తీసుకువస్తుండేది. ఉమామహేశ్వరరావు(20) అనే యువకుడు ఆమె వెంటపడుతున్నాడు. ఆమె ఎన్నిసార్లు హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో తన కుమార్తె కోచింగ్‌ను వేరే స్టేడియానికి మార్చింది.

ఆ విషయం తెలుసుకుని అక్కడికి కూడా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆమెను ఉమామహేశ్వరరావు అటకాయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో ఒక్కసారిగా తనవద్ద అప్పటికే సిద్ధంచేసుకున్న బ్లేడుతో దాడి చేశాడు. అనంతరం తన మెడపై కోసుకున్నాడు.
ఆమె మెడ ఎడమ భాగంలో స్వల్పగాయమైంది. దీనిపై కొంతమంది డయల్ 100కి ఫోన్‌చేసి సమాచారం అందించడంతో 108 వాహనం వచ్చి ఉమామహేశ్వరరావును కేజీహెచ్‌కు తీసుకువెళ్లింది. బాధితురాలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై దాడిచేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications