ఏకంగా పీఎంఓ పేరుతో తిరుమలలో ఘరానా మోసానికి యత్నం- కేసు నమోదు చేసిన సీబీఐ
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 71,613 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,980 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.74 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పట్టింది.
కాగా- ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా చెప్పుకొంటూ ఓ వ్యక్తి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతం టిక్కెట్లను పొందడానికి ప్రయత్నించాడు. దొరికిపోయాడు. ఈ ఏడాది మే 10వ తేదీన తిరుమలలో 10 సుప్రభాతం టిక్కెట్లు, మూడు ఎయిర్ కండిషన్డ్ గదుల కోసం అప్పటి కార్యనిర్వాహక అధికారి జే శ్యామలరావుకు మే 1న లేఖ రాశాడు. తన పేరు డాక్టర్ పీ రామారావు అని, ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నానని, ఢిల్లీ సౌత్ బ్లాక్‌లో తన ఆఫీస్ ఉందని పేర్కొన్నాడు.

దీనిపై టీటీడీ అధికారులకు అనుమానాలు తలెత్తాయి. పీఎంఓను సంప్రదించగా.. ఆ పేరుతో ఎవరూ పనిచేయట్లేదని వెల్లడించారు. దీంతో అధికారికంగా టీటీడీ అధికారులు ఈ వ్యవహారంపై పీఎంఓకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఏకే శర్మ, ఆ నకిలీ అధికారిపై చర్య తీసుకోవాలని కోరుతూ సీబీఐకి లేఖ రాశారు. దీనిపై ఈ నెల 2వ తేదీన ఎఫ్ఐఆర్ నంబర్ ఆర్సీ 0482025 ఎస్ 0009తో రామారావుపై కేసు నమోదయింది.
బీఎన్ఎస్ సెక్షన్లు 318 (4), 319 (2), 336 (3), 340 (2) కింద మోసం, పరువు నష్టం, ఐటీ చట్టం సెక్షన్ 66 డీ (కంప్యూటర్ వనరులను ఉపయోగించి మోసగించడం) కింద కేసులు నమోదు చేశారు. దీనిపై 'ది హిందూ' ఓ కథనాన్ని ప్రచురించింది. రామారావు మోసం చేయడానికి ప్రయత్నించడం ఇది మొదటి సారి కాదని, గతంలో, పూణేలోని ఓ యూనివర్శిటీలో అడ్మిషన్ కోరుతూ తనను తాను ప్రధానికి జాయింట్ సెక్రటరీ సీ శ్రీధర్‌గా పరిచయం చేసుకున్నట్లు వెల్లడించింది. భూసంబంధిత పత్రాల కోసం మైసూర్ తహసిల్దార్‌ను కూడా మోసం చేశాడని వివరించింది.












Click it and Unblock the Notifications