పోలవరం బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుల విషయంలో కీలక నిర్ణయం!
పోలవరం బనకచర్ల, నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టులపై సోమవారం సుప్రీంకోర్టులో వాయిదా ఉన్న నేపథ్యంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులు న్యాయవాదులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి వృధా జలాలు వాడుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నించిన ఆయన, న్యాయం మన వైపే ఉందని, కోర్టులో గట్టిగా వాదించాలని న్యాయవాదులకు సూచనలు చేశారు.
వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో ఎవరికి ఏం ఇబ్బంది
గోదావరి నది జల ప్రవాహానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ సముద్రంలో వృధాగా కలిసిపోతున్న 3వేల టిఎంసిల నీటిలో, రెండు వందల టీఎంసీల నీటిని వాడుకుంటే తప్పేంటి అని, వృధాగా పోయే నీటిని వాడుకోవడంలో ఎవరికి ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. తోటి తెలుగు రాష్ట్రానికి స్నేహహస్తం అందిస్తుంటే, వారు మాత్రం అన్యాయం జరిగిందని కోర్టుకు వెళుతున్నారని, ఇది విచారకరమని అన్నారు.

అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలమైన వాదనలను వినిపించాలని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని రికార్డులు లీగల్ టీంకు అందించాలని ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం సముద్రంలో వృధాగా 3000 టీఎంసీల నీరు కలిసిపోతుందని అందులో 200 టీఎంసీలు మాత్రమే తీసుకునేలా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించామని నిమ్మల రామానాయుడు తెలిపారు.
మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉంది
జిడబ్ల్యూడిటి అవార్డు ప్రకారం మిగిలిన నీటిని వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందన్న విషయాన్ని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. గోదావరి బేసిన్లో ఆంధ్రప్రదేశ్ దిగువ ప్రవాహ రాష్ట్రం కావడంతో ఇతర రాష్ట్రాల హక్కులకు భంగం కలగకుండా మిగిలిన వరద నీటిని వాడుకోవచ్చు అన్నారు. వృధాగా సముద్రంలోకి పోతున్న నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే ప్రాజెక్టు లక్ష్యంగా నిమ్మల రామానాయుడు తెలిపారు.
న్యాయబద్ధంగానే ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులు
కేంద్రానికి ప్రాజెక్టు ఫీజుబిలిటీ రిపోర్టు సమర్పించామని, వారి సూచనల మేరకే మార్పులు చేస్తున్నామని అన్నారు. చట్టపరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు చేపడతామని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ కేసును వాదిస్తున్నారు. కౌన్సిల్ లో మరో న్యాయవాది జయదీప్ గుప్తా వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యాయబద్ధంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపడుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.












Click it and Unblock the Notifications