ఏపీ మహిళకు డెడ్‌బాడీ పార్శిల్.. రూ. 1.30 కోట్లు డిమాండ్
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్ కలకలం రేపింది. ఓ మహిళ ఇంటికి పార్శిల్‌లో గుర్తు తెలియని మృతదేహం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం సమాచారం అందడంతో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నయీం స్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సాగి తులసి అనే మహిళకు యండగండి గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు కట్టుకుంటోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టరింగ్ దశలో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది.

ఈ నేపథ్యంలో మొదటి విడతగా సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకుంది. అయితే, ఈసారి పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రి రావాల్సి ఉండగా.. వాటికి బదులు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చింది. ఆ పార్శిల్ ఓ లేఖ కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఆ ఉత్తరంలో రూ. 1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించారు. చాలా సంవత్సరాల క్రితం తీసుకున్న రుణానికి సంబంధించిన మొత్తం ఇదని ఉంది. ఈ క్రమంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 ఏళ్ల వయస్సు్న గుర్తు తెలియని పురుషుడి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. అతడు నాలుగైదు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, రెండు రోజుల నుంచి కుటుంబానికి చెందిన చిన్న అల్లుడు కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా, తులసి భర్త గత పదేళ్ల క్రితం కనిపించకుండా పోయాడని, అప్పటి నుంచి ఆచూకీ లభించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. తులసి ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ప్రస్తుత ఘటన ఆమెకు సాయం చేస్తున్న క్షత్రియ సేవా సమితిని ఈ కేసులో ఇరికించే కుట్రగా కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications