TTD: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం - సీఎం కు ఆ భక్తుడి కండీషన్..!!
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని కోట్లాది భక్తులు దర్శించుకుంటారు. తమ శక్తి కొద్దీ ముడుపులు చెల్లించుకుంటారు. మరి కొంత మంది స్వామి వారి మీద విశ్వాసంతో భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. వ్యాపార ప్రముఖులు బంగారం ఆభరణాలు చేయిస్తారు. కాగా, తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు ఏకంగా 121 కిలోల మేలిమి బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆసక్తికర విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు.
తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి ఈ భక్తుడు విరాళం గురించి ప్రస్తావించారు. తిరుమలలో ఒక అజ్ఞాత భక్తుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఏకంగా 121 కేజీల బంగారంను భారీ విరాళంగా అందజేసేందుకు సిద్దం అయ్యారని చెప్పారు. ఆ భక్తుడు తన వ్యాపారం ప్రారంభించక ముందు శ్రీవారి పైన నమ్మకంతో స్వామివారిని మొక్కుకున్నట్లు తనకు చెప్పారన్నారు. అదే విధంగా స్వామి వారి ఆశీస్సులతో కంపెనీ పెట్టారని.. ఆ తరువాత అనుకున్న దానికంటే భారీగా సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు. అతను తన కంపెనీలోని 60 శాతం వాటాను అమ్మారని చంద్రబాబు వెల్లడించారు.

కాగా, ఆ భక్తుడు తన 60 శాతం అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారుగా ఆరేడు వేల కోట్లు డబ్బులు వచ్చాయన్నారు. దీంతో శ్రీవారి దయ వల్ల తనకు ఇదంతా వచ్చిందని,తన వంతుగా స్వామికి ఏదైన విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకొవాలనుకున్నాడని వివరించారు. దీంతో 121 కేజీల బంగారంను స్వామివారికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అంతేకాకుండా తన పేరు మాత్రం ఎక్కడ కూడా బైటకు రావొద్దని చెప్పి మరీ ఆ బంగారంను విరాళంగా ఇవ్వటానికి సిద్దమయ్యారని చంద్రబాబు అసలు విషయం చెప్పారు. వెంకటేశ్వర స్వామి రోజుకు 120 కేజీల ఆభరణాలు ధరిస్తారని.. ఇప్పుడు ఆ భక్తుడు 121 కేజీల బంగారం విరాళంగా ఇస్తున్నారని చెప్పారు. ఒకే వ్యక్తి శ్రీవారికి 140 కోట్ల విలువైన బంగారం ఇస్తున్నాడంటే.. అది ఆయనకు కలియుగ దైవం, ఆ వెంకటేశ్వర స్వామిపై ఉన్న నమ్మకమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన ఈ విషయం వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications