రోజంతా సముద్రంలో ఈది ప్రాణాలు కాపాడుకున్నాడు
తూర్పుగోదావరి: చేపల వేటకు వెళ్లి ఈదురు గాలులు, ఎగసిపడే కెరటాల ధాటికి పడవ బోల్తా పడటంతో సముద్రంలో చిక్కుకుపోయిన కాకినాడలోని పగడాలపేటకు చెందిన కోటయ్య రోజంతా సముద్రంలో ఈది ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాడు. కోటయ్య మాట్లాడుతూ.. చేపల వేట ముగించుకుని ఇంటికి బయల్దేరే సమయానికి భారీ తుఫాను తన పడవను చుట్టు ముట్టిందని తెలిపాడు.
బలమైన కెరటాలు, గాలులు ధాటికి పడవ బోల్తా పడిందని, పడవలోని టాప్ కింద మిగిలిన ఆరుగురు చిక్కుకుపోగా, తాను మాత్రం సముద్రంలో దూరంగా పడిపోయానని చెప్పాడు. పడవను చేరుకునేందుకు రోజంతా ఈదుతూనే ఉన్నానని తెలిపాడు.
ఇంతలో చీకటి పడిందని, పడవను చేరుకునే క్రమంలో చేతులు, కాళ్లు, వీపుకు గాయాలయ్యాయని చెప్పాడు. పడవను చేరుకునే లోపే మరో కెరటం వచ్చి దూరంగా కొట్టేసిందని తెలిపాడు.

తెల్లవారుజాము కావడంతో ఓపిక తెచ్చుకుని ఈత కొట్టానని, చనిపోతాననుకుంటున్న సమయంలోనే అటుగా వస్తున్న మత్స్యకారులు తనను చూసి తాడు వేశారని చెప్పాడు.
అయితే తనకు ఓపిక లేదని చెప్పడంతో వారే వచ్చి పడవలోకి ఎక్కించారని చెప్పాడు. ఒడ్డుకు చేర్చిన అనంతరం తనను కాకినాడ ఆస్పత్రిలో చేర్చారని తెలిపాడు. దీంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. తనతోపాటు వచ్చిన మిగితా వారు సముద్రంలోనే ప్రాణాలు వదిలారని కన్నీటి పర్యంతమయ్యాడు కోటయ్య.
ఇది ఇలా ఉండగా, గల్లంతైన మరో 43 బోట్లలో ఇప్పటి వరకు 41 బోట్ల ఆచూకీ లభ్యమైనట్లు ఫిషరీస్ డిడి గోవిందయ్య తెలిపారు. ఒక బొటు దెబ్బతిందని, అందులోని మత్స్యకారులు క్షేమంగా ఉన్నారన్నారు. మరో బోటు ఆచూకీ తెలియాల్సి ఉందని గోవిందయ్య చెప్పారు.
ఒడిశాలోని గోపాల్‌పూర్ తీరానికి 3 బోట్లు, శ్రీకాకుళం జిల్లా బారువా తీరానికి రెండు బోట్లు చేరుకున్నాయని వివరించారు. 12 మంది కాకినాడ మత్స్యకారులు క్షేమంగా ఉన్నారని, 9 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని గోవిందయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications