ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు మరో గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారికి మెరుగైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలన్న యోచనతో ఇటీవల రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనం, ఆధునిక వసతులను ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు విజయ డెయిరీ పాలను అందించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డెయిరీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. అలాగే పాడి రైతుల బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాలని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం పాల ఉత్పత్తి, పాలను ఇచ్చే పశువుల సంఖ్య తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆధునిక పద్ధతుల ద్వారా తెలంగాణలో పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చి, వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు జీవనోపాధిని, ఆర్థిక భరోసాను కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
ఇక ఇదే విషయంపై పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అవసరానికి తగినంత పాల ఉత్పత్తి జరగడం లేదని తెలిపారు. డిమాండ్ దృష్ట్యా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. ఈ సమస్యను అధిగమించాలంటే పాడి రైతులను ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు వారం రోజులపాటు మెనూ ప్రకారం బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. సోమవారం రోజున దోసె-చట్నీ లేదా చపాతీ-కర్రీ, మంగళవారం రోజున మిల్లెట్ ఇడ్లీ- సాంబార్, బుధవారం రోజున పూరి- ఆలూ కుర్మా, గురువారం రోజున ఇడ్లీ-సాంబార్, శుక్రవారం రోజున మిల్లెట్ ఉప్మా లేదా పొంగల్-చట్నీ, శనివారం రోజున బోండా-చట్నీ వడ్డిస్తున్నారు. అంతేకాక వారంలో 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావా కూడా అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications