కిడ్నాప్ కలకలం: తిరుమలలో నవ్యశ్రీ అపహరణ, ముమ్మర గాలింపు(వీడియో)
ఓ ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. తిరుమలలో కలకలం సృష్టించింది.
తిరుపతి: ఓ ఐదేళ్ల బాలిక కిడ్నాప్.. తిరుమలలో కలకలం సృష్టించింది. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం తూముచెర్లకు చెందిన మహాత్మా, వరలక్ష్మి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం తిరుమలకు వచ్చారు. ఆదివారం వేకువ జామున మాధవ నిలయానికి చేరుకుని పిల్లలతో కలిసి నిద్రపోయారు.
ఆదివారం ఉదయం 8.30 గంటలకు మహాత్మా నిద్రలేచి చూడగా.. పెద్దకుమార్తె నవ్యశ్రీ(5) కనిపించలేదు. వెంటనే భద్రతా సిబ్బందికి తెలిపి సమాచార కేంద్రం ద్వారా ప్రకటన చేయించారు. అనంతరం చుట్టపక్కల గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐ వెంకటరవి సీసీ టీవీ కెమెరాలో పరిశీలించారు. ఉదయం 7.25 గంటలకు నవ్యశ్రీని ఓ వ్యక్తి దుప్పటి కప్పి ఎత్తుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. నిందితుడి చిత్రాలను విడుదల చేశారు.
కాగా, త్వరలోనే చిన్నారిని కిడ్నాపర్ల నుంచి విడిపిస్తామని సోమవారం ఉదయం డీఎస్పీ తెలిపారు. డాగ్ స్క్వాడ్ తో గాలింపు చేపట్టినట్లు చెప్పారు. నిందితుడు తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో పారిపోయినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు.
ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి
కడప జిల్లా జమ్మలమడుగు పాత బస్టాండు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి వైపు నుంచి వస్తున్న కారు జమ్మలమడుగు పాతబస్టాండు వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతులను జమ్మలమడుగుకు చెందిన అశ్వద్ధామ, గోవర్ధన్, తులసీరామ్‌గా గుర్తించారు. మృతదేహాలను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications