తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం, వేల టన్నుల్లో పూలు, పండ్లతో !
కలియుగదైవం శ్రీవెకంటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో ఉగాది వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. తిరుమలలోని శ్రీవారి ఆయలంలో శ్రీ కోధ్రినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడకగా జరిగింది. వందలాది సంవత్సరాల నుంచి తిరుమలలో ఘనంగా ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్తానం వేడుకగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

శ్రీవారి ఆలయం వెలుపల టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ, భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు. ఉగాది సందర్బంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 60 వేల కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు.

శ్రీవారి ఆలయం లోపల ఆపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.

శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం దగ్గర పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా అయోధ్య రామాలయం, బాల రాముడి సెట్టింగ్, నవధాన్యాలతో రూపొందించిన మత్స అవతారము భక్తులను మైమరిపించింది.

శ్రీవారి ఆలయం వెలుపల గొల్ల మండపం పక్కన త్రేతా, ద్వాపర, కలియుగాలకు సంబంధించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీమహావిష్ణువు దశావతారాలు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న రామలక్ష్మణుల సమేత హనుమంతుల వారు, బాల కృష్ణుడు వంటి పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.












Click it and Unblock the Notifications