బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం: వాయుగుండంగా: ఏపీకి భారీ వర్షాలు
అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. బంగాళాఖాతం గగనతలంపై ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ అల్పపీడనం ఈ నెల 15, 16వ తేదీల నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీనికి అనువైన వాతావరణం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం (Cyclonic circulation) క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు వివరించింది.

దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ వాతావరణం తుఫానుగా మారుతుందా? లేదా? అనేది వాతావరణ శాఖ ఇంకా ప్రకటించలేదు.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావం వల్ల తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. సోమవారం అర్ధరాత్రి నాగపట్నంలో అతి భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తరహా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
బంగాళాఖాతం మధ్య భాగంలో గాలుల వేగం పెరిగింది. గంటకు 45 నుండి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తోన్నాయని స్కైమెట్ వెదర్ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీల్లో బంగాళాఖాతం నైరుతి దిశ మీదుగా తమిళనాడు, ఏపీ తీర ప్రాంతాలపై.ఈ గాలులు వీస్తాయని, మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.












Click it and Unblock the Notifications