వినుకొండ దారుణ హత్యను మరిచిపోకముందే..
Tirupati Murder: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు షేక్ రషీద్ దారుణ హత్య.. కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ జాతీయ స్థాయి ఉద్యమానికి పూనుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లనుంది.
వైఎస్ఆర్సీపీ నాయకుడు రషీద్‌ను వినుకొండలో తెలుగుదేశం పార్టీకి చెందిన జిలానీ నడిరోడ్డుపై నరికి చంపాడు. చేతులు నరికాడు. మెడపై పలుమార్లు కత్తితో నరికాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మరణించారు.

ఈ ఘటనను విస్మరించకముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ గుర్తు తెలియని యువకుడు రెచ్చిపోయాడు. ముగ్గురు మహిళలపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు కత్తిపోట్లకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తిరుపతి రాయల్ నగర్‌లో శ్రీనివాస్ అనే వ్యాపారి ఇంట్లో ఈ ఘటన సంభవించింది. హతురాలి పేరు జయలక్ష్మి. వయస్సు 75 సంవత్సరాలు. గురువారం రాత్రి మాస్క్ ధరించిన ఓ యువకుడు శ్రీనివాస్ ఇంట్లో అక్రమంగా ప్రవేశించాడు. జయలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో ఆమె మరణించారు. దాడిని అడ్డుకోబోయిన జయలక్ష్మి కోడలు సురక్ష, మనమరాలు నియతిపైనా దుండగుడు దాడి చేశాడు. వారు కత్తిపోట్లకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications