కాల్పుల కలకలం: ప్రేమించిన యువతిని కాల్చి చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తానూ ఆత్మహత్య
నెల్లూరు: జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించలేదనే కోపం తుపాకీతో కాల్పులు జరిపాడు యువకుడు. ఆ తర్వాత అతడు కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరి మరణాలతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన మాలపాటి సురేశ్ రెడ్డి, పాలకూరు కావ్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా వీరు ప్రేమించుకుంటున్నట్లుగా తెలిసింది. ఉద్యోగరీత్యా వీరిద్దరూ గతంలో బెంగళూరులో ఉండేవారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా, సురేశ్, కావ్య ప్రేమ విషయం ఇటీవల యువతి ఇంట్లో తెలిసింది. ఒకే కులం వారైనప్పటికీ సురేశోతో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సురేవ్ తుపాకీతో కావ్య ఇంటికి వెళ్లి ఆమెపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తీవ్రగాయాలపాలైన కావ్యను స్థానికులు 108 ద్వారా నెల్లూరు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రేమించిన యువతిపై సురేష్ కాల్పులు జరపడానికి గల కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సురేశ్‌కు తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపైనా విచారణ చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications