ప్రేమించట్లేదని విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాద టీచర్: చితకబాదిన స్థానికులు
కర్నూలు: విద్యార్థులకు మంచి విద్యా, బుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని ఓ విద్యార్థినిపై దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించట్లేదనే కోపంతో 9వ తరగతి విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బంగారుపేటలో చోటు చేసుకుంది.
ఎవరూ లేని సమయం చూసి 9వ తరగతి విద్యార్థిని ఇంటికెళ్లిన ఉపాధ్యాయుడు శంకర్.. ఆమె గొంతుకోశాడు. ఆమె ప్రతిఘటించి.. కేకలు వేయగా.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో నిందితుడు శంకర్ కూడా తన గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

అతడ్ని పట్టుకున్న స్థానికులు చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రగాయాలపాలైన బాధిత విద్యార్థినిని, నిందితుడు శంకర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. విద్యార్థిని పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని తెలిసింది. శంకర్ పరిస్థితి నిలకడగానే ఉంది.
కాగా, గత కొద్ది రోజులు సదరు ఉపాధ్యాయుడు తనను ప్రేమించాలంటూ బాధిత విద్యార్థినిని వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న శంకర్ ఈ దారుణానికి తెగబడ్డాడు. దాడికి పాల్పడిన సమయంలో శంకర్ మద్యం మత్తులో ఉన్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications