బావిలో దూకి యువతి ఆత్మహత్య: విద్యార్థినిపై రేప్‌యత్నం
మెదక్: కుటుంబ కలహాల కారణంగా ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సిద్దిపేట వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన రమ్య (18) అనే యువతి డిసెంబర్ 20న ఇంట్లో గొడవ జరగడంతో తీవ్రమనస్తాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. తీరా బాలాజీ గార్డెన్ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
విద్యార్థినిపై అత్యాచారం

ఖమ్మం: ఇంట్లో ఒంటరిగా ఉన్న 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిపై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామానికి చెందిన కడారి మహేష్(23) ఇబ్రహీంపట్నంలో డిగ్రీ చదువుతున్నాడు.
బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని(14) పాఠశాల నుంచి ఇంటికి చేరుకుంది. బాలిక ఒంటరిగా ఉండటంతో మహేష్ ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థిని బిగ్గరగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు అక్కడి చేరుకున్నారు. దీంతో మహేష్ అక్కడ్నుంచి పారిపోయాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications