యువతిని సజీవ దహనం చేసిన ప్రేమోన్మాది: ఆ తర్వాత అతని కూడా..
విశాఖపట్నం: జిల్లాలోని తగరపువలసలోని టీ.నగరపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడి ప్రేమోన్మాదం రెండు నిండు ప్రాణాలను బలికొంది. తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో ఓ యువకుడు జరిపిన ఉన్మాద చర్యకు ఓ యువతి బలైంది. తన అక్కను కాపాడే ప్రయత్నంలో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, దాడికి పాల్పడిన యువకుడు కూడా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తగరపువలసలోని టీ నగరపాలెంలో రూప అనే యువతి నివాసముంటోంది. తన తమ్ముడు ఉపేంద్రతో కలిసి ఉన్న రూపపై హరి సంతోష్ అనే యువకుడు దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించి పరారయ్యాడు.

తన అక్కకు అంటుకున్న మంటలు ఆర్పివేసే క్రమంలో తమ్ముడు ఉపేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మంటల్లో పూర్తిగా కాలిపోయి రూప అక్కడిక్కడే చనిపోయింది. ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే పరారైన హరి సంతోష్ కూడా రైలు కింద పడి చనిపోయాడు. ఓ యువకుడి ప్రేమోన్మాదానికి రూప చనిపోవడం, ఆమె సోదరుడు ఉపేంద్ర తీవ్రగాయాలపాలవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications