రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తాజా హెచ్చరిక..!!
రుతుపవనాలు తిరిగి విస్తరిస్తున్నాయి. ఈ నెల తొలి వారంలోనే రాష్ట్రానికి చేరిన నైరుతి మధ్యలో ముందుకు సాగలేదు. ఫలితంగా ఎండ తీవ్రత.. ఉక్కపోత పెరిగిపోయింది. కాగా, తాజాగా ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇక.. తాజాగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. రానున్న అయిదు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరిక చేసింది.
రానున్న 24గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 8న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినా .. అకస్మిక మార్పుల వల్ల ముందుకు సాగలేదని పేర్కొన్నది. తమిళనాడు, రాయలసీమ మీదుగా తెలంగాణ నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి ఏర్పడటంతో మళ్లీ పుంజుకున్నాయని తెలిపింది.దీని ప్రభావంతో వచ్చే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువగా, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కున్నారంలో అత్యధికంగా 17.29 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.

అయిదు రోజులు భారీ వర్షాలు
కాగా, మంగళవారం జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్టు పేర్కొన్నది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. మరోవైపు ఏపీలో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో, జిల్లా యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది.













Click it and Unblock the Notifications