హైదరాబాద్ లో రాత్రి భారీ ర్యాలీ- కేంద్రం ముందు పలు డిమాండ్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నిరసన గళం విప్పారు. హైదరాబాద్ లో భారీ ఎత్తున మశాల్ మార్చ్ నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజరుద్దీన్ సహా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోందని ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వెనుక ఉన్న అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని అన్నారు. పరీక్ష నిర్వహణలో చోటుచేసుకున్న ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గళమెత్తిన వారిపై పోలీసులను ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి అణచివేత చర్యలు పోరాటాలను ఎప్పటికీ ఆపలేవని ఆయన స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియలో కీలకమైన నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు కోట్ల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, పలువురు ఆత్మహత్య చేసుకున్నారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన పేద, మధ్యతరగతి విద్యార్థుల శ్రమ.. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల నీరుగారిందని, ఇది దేశానికే సిగ్గుచేటని ఆయన విమర్శించారు. దేశంలో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకే తాము నిరసన ప్రదర్శనలను నిర్వహించాల్సి వస్తోందని చెప్పారు.
విద్యార్థుల ప్రయోజనాలే పరమావధిగా తమ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ లోపల, బయట ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కేంద్రం తక్షణమే కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి, పేపర్ లీకేజీలకు కారణమవుతున్న ఇలాంటి పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చాలని చెప్పారు.












Click it and Unblock the Notifications