ఏపీలో తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్: వీటి ఫీచర్లు- వరప్రదాయిని
ఏపీలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం నూతన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 500 అత్యాధునిక తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులైన తల్లులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడానికి ఉద్దేశించిన వాహనాలు ఇవి. దీనివల్ల సంవత్సరానికి సుమారు 2.75 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో ఈ వాహనాలను స్వయంగా పరిశీలించారు. వాహనాలలో కల్పించిన భద్రతా ప్రమాణాలు, తల్లీపిల్లల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక వసతులను తనిఖీ చేశారు. వాటి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాహనాలపై వేసే బ్రాండింగ్, పోస్టర్ల డిజైన్లను ఆయన ఆమోదించారు. వాహనాల స్టిక్కరింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే వీటిని అధికారికంగా రోడ్డు ఎక్కించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా వాహనాల నిర్వహణ, వాటి పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు. ఈ తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను గర్భిణులు, బాలింతల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ప్రయాణంలో తల్లీబిడ్డలకు ఎటువంటి అలసట, అసౌకర్యం కలగకుండా ఏసీ సదుపాయం కల్పించారు. వెనుక సీట్లలో కూర్చునే బాలింతల భద్రత కోసం ప్రత్యేక సీట్ బెల్టులు, వారు సులభంగా వాహనం ఎక్కడానికి వీలుగా అనుకూలమైన ఫుట్‌రెస్ట్‌లు అమర్చారు. ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అగ్నిమాపక పరికరాలను కూడా ఇందులో ఉన్నాయి.
ప్రతీ వాహనానికి జీపీఎస్ ఉంటుంది. వీటిని కంట్రోల్ రూమ్ రియల్ టైమ్ లొకేషన్ తో అనుసంధానించారు. ఫలితంగా ఏ వాహనం ఎక్కడ ఉందనేది అధికారులు కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించవచ్చు. ఈ వాహనాలు కాన్పు అయిన వారిని ఇళ్లకు చేర్చడానికే కాకుండా, అత్యవసర సమయాల్లో కూడా సేవలందించగలవు.
రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు, హై రిస్క్ గర్భిణులను తక్షణ వైద్య చికిత్స కోసం సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఈ వాహనాలను వినియోగిస్తారు. తద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉండే వారికి అత్యవసర వైద్య సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.












Click it and Unblock the Notifications