ఆ రైతులందరికీ ఉచిత విమాన ప్రయాణం - ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాట్ల పైన సమీక్ష చేసారు. కీలక నిర్ణయాలు వెల్లడించారు. ఇదే సమయంలో అక్కడ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు ఉచిత విమానయానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రారంభోత్సవం పండుగగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. తాజా గా చేసిన సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. విమానాశ్రయం కోసం తమ స్థలాలను, పంట పొలాలను త్యాగం చేసిన రైతులకు ఒకసారి ఉచితంగా విమాన ప్రయాణం కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణంలో రైతుల పాత్ర అత్యంత కీలకమని, వారి త్యాగాన్ని ప్రభుత్వం ఎప్పటికీ మరువదని చెప్పారు. ప్రారంభోత్సవం రోజున ఉత్తరాంధ్ర ప్రాంతమంతా సంబరాల వాతావరణం నెలకొనేలా పండగలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఈ సమయంలో ప్రధానికి ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘన స్వాగతం పలకాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ప్రధానికి అఖండ స్వాగతం.. భారీ ఏర్పాట్లు
ప్రారంభోత్సవం వేళ స్థానిక గిరిజన, జానపద నృత్యాలు, సాంప్రదాయ ప్రదర్శనలతో ప్రధానికి ఆహ్వానం పలికేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌తో పాటు మొత్తం ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని, పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. విమానాశ్రయంతోపాటు జీఎమ్మార్ స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ వర్సిటీ, ఎడ్యుసిటీలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 31వరకు విస్తృత ప్రచారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ విశిష్ఠత ఉత్తరాంధ్రలోని ప్రతిగడపకూ తెలిసేలా రానున్న పది రోజులూ కార్యక్రమాలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications