తెలంగాణాకు కేంద్రం తీపికబురు.. ఘట్‌కేసర్ కాజీపేట మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
ప్రజల అవసరాలకు రైల్వే విస్తరణపై కేంద్ర రైల్వే శాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అవసరం అయిన అదనపు ట్రాక్స్ ను ఏర్పాటు చేయటంతో పాటు, అదనపు రైళ్ళను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లను అమృత్ భారత్ స్టేషన్ స్కీం క్రింద పురోభివృద్ధి చేస్తూనే మరోవైపు అవసరం అయిన చోట్ల రైళ్ళ సామర్ధ్యం పెంచే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో తాజాగా కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి మరో శుభవార్త చెప్పింది. కేంద్ర మంత్రివర్గం సికింద్రాబాద్ డివిజన్‌లోని ఘట్‌కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,419 కోట్లు. తెలంగాణలో అత్యధికంగా వినియోగించే ముఖ్యమైన రైలు కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో రైలు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ పనులు చేపట్టనున్నారు.

ఈ ప్రాజెక్టు ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ జిల్లాలను కలుపుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సమయపాలన, సామర్థ్యం సమస్యలు ఎదురవుతున్నాయి. అదేఇక్కడ మల్టీ-ట్రాకింగ్ పూర్తయితే అదనపు ట్రాక్‌లు వచ్చి రైళ్ల సంఖ్య పెరుగుతుంది. ప్రయాణికులు, సరకు రవాణా రెండింటికీ మెరుగైన సౌకర్యం లభించనుంది. ప్రజలకు రైళ్ళ ఇబ్బందులు తగ్గుతాయి.
కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది మల్టీ-ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అందులో ఇది ఒకటి. కేంద్రం ఆమోదం తెలిపిన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ ల మొత్తం వ్యయం రూ.20 వేల కోట్లు. ఈ ప్రాజెక్టులు తొమ్మిది రాష్ట్రాల్లో 20 జిల్లాలను కలుపుతాయి. తెలంగాణలోని ఈ ప్రాజెక్టు రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, ప్రయాణ సమయాలు తగ్గించి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతం ఇవ్వనుంది.
ఘట్‌కేసర్ నుంచి కాజీపేట వరకు ఉన్న ఈ మార్గం హైదరాబాద్ నుంచి వరంగల్, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రాజెక్టు పూర్తయితే రైలు రద్దీ తగ్గి, సమయపాలన మెరుగుపడి ప్రయాణికులకు లాభం చేకూరుతుంది. ఈ ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు మెరుగుపడితే ఈ ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అవుతుంది.
కాగా సికింద్రాబాద్ ఘట్‌కేసర్-కాజీపేట రైల్వే లైన్ మల్టీ-ట్రాకింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 2 వేల 419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 110 కిలో మీటర్ల ఈ కారిడార్, తెలంగాణ రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
