మిథున్ రెడ్డికి రెగ్యులర్ బెయిల్, కండీషన్స్ అప్లై..!!
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు అయింది. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న మిథున్ రెడ్డి పైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. ఈ నెల 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డికి న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తరువాత తిరిగి మిథున్ సరెండర్ అయ్యారు. ఇక.. రెగ్యులర్ బెయిల్ కోసం మిథున్ దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ జరిగింది. దీంతో.. ఏసీబీ కోర్టు కండీషన్లతో బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్ దక్కింది. ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కండీషన్లను విధించింది. 71 రోజులుగా మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో ఉన్నారు. లిక్కర్ కేసులో ఏ-4గా ఉన్న మిథున్ మొత్తం స్కాంలో మాస్టర్ మైండ్ గా సిట్ పేర్కొంది. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

మిథున్ ను కోర్టు అనుమతితో సిట్ రిమాండ్ కు తీసుకొని విచారణ చేసింది. ఇప్పుడు బెయిల్ మంజూరు కావటంతో మిథున్ రేపు (మంగళవారం) రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. మిథున్ కు బెయిల్ రావటంతో ఈ కేసులో ఇప్పటికే అయిదుగురు నిందితులకు బెయిల్ దక్కినట్లు అయింది.
అటు ఈ కేసులో బెయిల్ దక్కించుకున్న దనుంజయ రెడ్డి, క్రిష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్పల పైన సిట్ హైకోర్టును ఆశ్రయించింది. వీరి బెయిల్ రద్దు చేయాలని కోరింది. ప్రభుత్వం తరపున సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే, 90 రోజులు రిమాండ్ లో ఉన్నా.. ఎలాంటి నేర నిరూపణ జరగలేదని... బెయిల్ కోసం ప్రయత్నించే సమయంలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నారని ఆ ముగ్గురి తరపు న్యాయవాదులు వాదించారు.
కాగా, ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ మంజూరు సమయంలో ప్రతీ సోమ, శుక్రవారాలు లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. రూ 2 లక్షలతో రెండు షూరిటీలు ఇవ్వాలని నిర్దేశించింది. రేపు (మంగళవారం) మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు రానున్నారు.












Click it and Unblock the Notifications