రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ- వైసీపీ మంత్రులకు అగ్నిపరీక్ష-జగన్ హెచ్చరికల నేపథ్యం..
ఏపీలో రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఐదు రోజుల పాటు జరుగుతాయని భావిస్తున్న ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరోవైపు అమరావతి నుంచి రైతులు అరసవిల్లి వరకూ చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం తాజాగా కేబినెట్ భేటీలో సీఎం జగన్ చేసిన హెచ్చరికలే.

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పాలన వికేంద్రీకరణ, పరిపాలన సంస్కరణలపై చట్టసభలు వేదికగా విస్తృత చర్చకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అప్పులు, పెట్టుబడులు, వృద్ధి రేటు, ఇసుక, పోలవరం, మద్యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, మహిళా సాధికారితపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. అన్నింటి కంటే మించి అమరావతిపై విపక్షాలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇచ్చేందుకే ఈ సమావేశాల్ని ప్రభుత్వం వాడుకోబోతోంది.

మంత్రులకు అగ్నిపరీక్ష
రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు అందరికంటే ఎక్కువగా వైసీపీ మంత్రులకు కీలకంగా మారిపోయాయి. ఈ సమావేశాల్లో మంత్రుల వ్యవహారశైలిని సీఎం జగన్ నిశితంగా పరిశీలించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టబోతున్న ప్రభుత్వం అంతకు మించి అమరావతి పాదయాత్రను సైతం కౌంటర్ చేయబోతోంది. ఇందులో మంత్రులదే కీలకపాత్ర.ఇందులో వారు రాణించే దానిపైనే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో గట్టెక్కుతుందా ? ఇరుక్కుంటుందా అనేది ఆధారపడబోతోంది.

జగన్ హెచ్చరికలతో టెన్షన్
తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ గట్టి వార్నింగ్ పంపారు. విపక్షాల్ని కౌంటర్ చేయడంలో మంత్రులు దారుణంగా విఫలమవుతున్నారని నిలదీశారు. అంతే కాదు మీరు మారతారా నన్నే మార్చేయమంటారా అంటూ మరోసారి కేబినెట్ విస్తరణకు కూడా సంకేతాలు ఇచ్చేశారు. దీంతో మంత్రులు ఇప్పుడు గతంలో కంటే బెటర్ గానే విపక్షాల్ని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు.
అయితే ఇదంతా ఓ ఎత్తయితే అసెంబ్లీలో రికార్డెడ్ గా సాగే ప్రసంగాలు మరో ఎత్తు. దీంతో మంత్రులు అమరావతిని, చంద్రబాబును, టీడీపీని, జనసేనను, బీజేపీని కలిపి కుమ్మేసేందుకు అసెంబ్లీలో అవకాశం దక్కబోతోంది. ఇందులో వారు సక్సెస్ అయితే సరేసరి. లేకపోతే జగన్ దృష్టిలో మంత్రులు మరింత పలుచన కావడం ఖాయం. దీంతో ఈ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications