జగన్ ఎఫెక్ట్, తిరుపతిలో స్పెషల్ ఫోర్స్ ఎంట్రీ, తోకతిప్పితే అంతే కథ
వైసీపీ అధినేత వైఎస్. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి జంతువులతో తయారుచేసిన కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన సమయంలో జగన్ తిరుమల పర్యటన ఖరారైయ్యింది. శుక్రవారం తిరుమల చేరుకోనున్న మాజీ సీఎం జగన్ శనివారం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
అయితే అన్యమతస్తులు అందరూ డిక్లరేషన్ ఇచ్చినట్లే మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ నుండి డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారని తెలిసింది. ఈ సమయంలో జగన్ తిరుమల పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. తిరుపతిలో ఇప్పటికే సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలులో ఉందని. ఎవరు కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.

తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయం నుండి జగన్ ను ర్యాలీగా అలిపిరి వరకు పిలుచుకొని వెళ్లాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేశారు. ఈ సందర్భంలో పోలీసు నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు తిరుపతి జిల్లా వైసీపీ నాయకులను కలిసి వారికి నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటన సందర్భంగా అదనపు పోలీసు బలగాలు తిరుపతి జిల్లాకు చేరుకున్నాయి.
చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలను తిరుపతికి తరలించారు. జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని పలువురు హిందూ స్వామీజీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంఘాలతో పాటు పలువురు, స్వామీజీలు తిరుపతిలోనే మకాం వేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ గో బ్యాక్ అంటూ తిరుపతిలో నినాదాలు మొదలైనాయి.
ఇదే సందర్భంలో కూటమి పార్టీల నాయకులు తొందరపాటు, దూకుడు నిర్ణయాలు తీసుకోరాదని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ సీనియర్ నాయకులు కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. రేణిగుంట విమానాశ్రయం నుండి జగన్ ను భారీ ర్యాలీతో పిలుచుకుని వెళ్లాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేయడంతో పోలీసులు ఆ కోణంలో నిఘా వేశారు. ఇప్పటికే ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు నిషేధించిన తిరుపతి జిల్లా పోలీసులు జగన్ ర్యాలీగా వెళ్లకుండా ఆడుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఎవరైనా నియమాలు ఉల్లంఘించి తోక తిప్పితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు హెచ్చరించారు. వైసీపీ జెండాలుకాని, ఆ పార్టీ నాయకుల వాహనాలకు ఉన్న ఆ పార్టీ జెండాలు కానీ ప్రదర్శించడానికి వీలులేదని, ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించరాదని, శాంతిభద్రతలకు ఆటంకం కలిగించరాదని పోలీసు అధికారులు వైసీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.
రేణిగుంట విమానాశ్రయం విమానాశ్రయం నుండి జగన్ ఆయన కారులో సాదాసీదాగా అలిపిరి వరకు వెళ్తే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు ఓ పోలీసు అధికారి అంటున్నారు. అయితే హంగామా చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వైసీపీ నాయకులపై పోలీసు అధికారులు నిఘా వేశారు. మొత్తం మీద మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీయడంతో స్థానిక ప్రజలు ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.












Click it and Unblock the Notifications