జైల్లో చంద్రబాబుకు మరింత భద్రత ? ఏసీబీ కోర్టు తీర్పు వేళ జైళ్ల శాఖ చర్యలు..!
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏసీబీ కోర్టు తీర్పుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై చంద్రబాబు తరఫు లాయర్లు ఏసీబీ కోర్టులో హౌస్ అరెస్టు కు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం దీనిపై తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ కీలక చర్యలు చేపట్టింది.
రాజమండ్రి జైల్లో కరడుగట్టిన నేరస్తులు, మావోయిస్టుల మధ్య చంద్రబాబుకు భద్రత ఉండదని, కాబట్టి ఆయన్ను హౌస్ అరెస్టు చేసేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్నంతా ఏసీబీ కోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. ప్రభుత్వం మాత్రం చంద్రబాబుకు ఇంట్లో కంటే జైల్లోనే భద్రత ఉంటుందని వాదించింది. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆయన లాయర్ లూథ్రా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏసీబీ కోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.

ఇవాళ మధ్యాహ్నం ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వబోతున్న వేళ రాజమండ్రి కేంద్ర కారాగారంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే కొత్తగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబును ఉంచామని, అక్కడ ఎవరూ లేరని, కేవలం ఐదుగురు భద్రతా సిబ్బందిని మాత్రమే ఉంచామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హౌస్ అరెస్టు కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీంతో జైల్లో ప్రత్యేకంగా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రత, ఇతర ఏర్పాట్లపై జైళ్ల శాఖ ప్రభుత్వానికి వివరణ కూడా ఇచ్చింది. దీన్ని కూడా తీర్పు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలని సీఐడీ తరఫు న్యాయవాది, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి న్యాయమూర్తికి ఇవ్వనున్నారు. దీంతో ఏసీబీ కోర్టు తీర్పు వేళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications