అదికారుల అండ ఉంటేనే ఐదేళ్లు గట్టెక్కేది..! లేకపోతే జగన్ కు పరిపాలనా సమస్యలు తప్పవు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోయే యువ నేత జగన్ మోహన్ రెడ్డికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి.ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. ఏపీ కొత్త సీఎం జగన్ మోహన్‌రెడ్డి మాత్రం.. ప్రభుత్వ యంత్రాంగం చేతికి పాలనా పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అపార అనుభవం.. ఏదో చేయాలనే తపన.. సామాజికంగా ఉన్నత ఆలోచనలు ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏరికోరి మరీ పరిపాలనలో భాగం చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెడ్డి వర్గానికి చెందిన సీనియర్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించి సమర్థుల సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది.

లోటు బడ్జెట్ రాష్ట్రం..! జగన్ కు కావాలి అదికారుల సహకారం..!!
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంత పెత్తనం చెలాయించినా శాంతిభద్రతల విషయంలో పోలీసు అధికారులకే బాధ్యత వదిలేసేవాడు. పైగా రక్షణ చర్యల విషయంలో వారి ఆదేశాలనే వైఎస్ శిరసావహించేవాడు. అటువంటి వైఎస్ నడచిన దారిలోనే జగన్ కూడా పరిపాలన సక్రమంగా సాగేందుకు ప్రభుత్వంపై ప్రజల్లో మంచి భావన కలిగేందుకు ప్రభుత్వ ఉద్యోగులకే పగ్గాలు ఇవ్వబోతున్నారు. స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ అధికారి లక్ష్మి, ఐపీఎస్ నాగిరెడ్డి, ఐఏఎస్ మల్లారెడ్డి వంటి వారు కూడా సమర్థులు పైగా వైఎస్‌కు అత్యంత ప్రీతిపాత్రులు. అందుకే ఏరికోరి వారిని తన కోటరీలో భాగం చేసుకుంటున్నాడు జగన్. అదే సమయంలో అమరావతి రాజధాని భూముల గోల్‌మాల్‌పై పూర్తి బాధ్యతను అధికారులకే అప్పగించి పర్యవేక్షణ మాత్రమే తాను చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

నవరత్నాలకు అయ్యే ఖర్చు ఎంత..! జగన్ వ్యూహం ఏంటి..!!
దీని ద్వారా జగన్ తాను రాజధాని రైతులకు ఇచ్చిన హామీ నెరవేరినట్టవుతుంది. రాజధాని నిర్మాణానికి ఎంత భూమి అవసరమో అంతమేర సేకరించామనే పేరు ప్రభుత్వానికి దక్కుతుంది. మంత్రివర్గంలో కూడా తన వెంట నడిచేవారే గాకుండా వ్యక్తిత్వం.. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోగల ఎమ్మెల్యేలకే ఇద్దామనే భావనలో ఉన్నారట. సీనియర్‌లు ఆశపడుతున్నా.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో 5 వరకూ కొత్త ముఖాలనే మంత్రిమండలిలో చేర్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. ఇదంతా ఎందుకనే అనుమానం సహజంగానే రావచ్చు. వాస్తవానికి జగన్ చాలా క్లిష్టమైన సమయంలో బాధ్యతలు చేపడుతున్నారు. ఏ మాత్రం తప్పులు దొర్లినా రాజకీయ భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పైగా కేసీఆర్, మోదీ ఇద్దరితో సమన్వయం చేసుకుంటూ మెలగాల్సిన గడ్డు పరిస్థితి కూడా నెలకొంది.

కేంద్రంతో సఖ్యత ఉంటే సరిపోతుందా..! నిధులు ఎలా సమకూరుతాయి..!!
ఇద్దరిలో ఏ ఒక్కరికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించినా ప్రమాదమే. అందుకే ఈ అడ్డంకులు అధిగమించి లోటుబడ్డెట్‌లోనూ సిబ్బంది జీతాలు, సంక్షేమపథకాలు, నవరత్నాలు వంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 2.60లక్షల కోట్ల రూపాయల అప్పులను అధిగమిస్తూ.. కొత్త అప్పులు తేవాలి. ఇదంతా జగన్ ఒక్కడివల్ల అయ్యే పనికాదు. దీనికి కాకలు తీరిన రాజకీయ ఉద్దండులు ఎంత అవసరమో.. అధికారులు కూడా అంతే కీలకం. ఇది గమనించిన జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ప్రభుత్వంలో భాగం చేసి.. కావాల్సినంత స్వేచ్ఛ ఇవ్వాలనుకోవటం మొదటి అడుగుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ హామీల పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున ఆశలు..! అదికారుల సలహాలు ఎలా ఉండబోతున్నాయి..!!
దీన్ని స్వప్రయోజనానికి ఉపయోగించుకునే అధికారులను గాకుండా ప్రజా మేలు కోసం సమర్థతతోపాటు నీతి నిజాయతీలున్న అధికారులకు పట్టం కడుతున్నారు. ప్రభుత్వానికి ఇటువంటి వారివల్లనే మంచి పేరు వస్తుందని జగన్ ముందుగానే ఆలోచన చేయటం జగన్ రాజకీయ ముందుచూపుకు అద్దంపడుతోంది. మరి దీన్ని మూణ్నాళ్ల ముచ్చటగా మార్చేస్తారా! కొనసాగిస్తారా అనేది మాత్రం జగన్ విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని పార్టీ సీనియర్‌లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications