ఏపీ, తెలంగాణలో 18 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 9వేల కోట్లు: తెలుగు రాష్ట్రాలే టాప్
న్యూఢిల్లీ: రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) నివేదిక వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అత్యధిక శాతం మంది పార్లమెంటేరియన్లు ఉన్నారు. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(NEW) అనే సంస్థతో కలిసి 225 మంది (మొత్తం 233 మంది సభ్యులు) రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదిక విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో 18 మంది ఎంపీలు ఉండగా.. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ. 9,419 కోట్లు ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు(మొత్తం 11 మంది ఎంపీలు), తెలంగాణ నుంచి ముగ్గురు(మొత్తం ఏడుగురు ఎంపీలు), మహారాష్ట్ర- ముగ్గురు(మొత్తం 19 మంది), ఢిల్లీ నుంచి ఒకరు(ముగ్గురు ఎంపీలు), పంజాబ్-2(ఏడుగురు ఎంపీలు), హర్యానా-1(ఐదుగురు ఎంపీలు), మధ్యప్రదేశ్-2 (మొత్తం 11 మంది) ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ. 100 కోట్లుగా ప్రకటించినట్లు పేర్కొంది.

తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ. 5596 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 3823 కోట్లుగా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు విలువ రూ. 1941 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో తెలిపింది. మొత్తం 225 మంది సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారని పేర్కొంది.
అలాగే, 41 మంది సెట్టింగ్ రాజ్యసభ సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండగా.. మరో ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు నమోదైనట్లు తెలిపింది. నలుగురు ఎంపీలపై మహిళా వేధింపులకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలిపింది. వీరిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌పై అత్యాచార కేసు నమోదైనట్లు తెలిపింది.
బీజేపీకి చెందిన 85 మంది సభ్యుల్లో 23 మందిపై, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 సభ్యుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. టీఎంసీకి చెందిన 13 మంది, ఆర్జేడీ నుంచి నామినేట్ అయిన ఐదుగురిపై, సీపీఐ నుంచి నలుగురిపై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు, వైయస్సార్సీపీ నుంచి ముగ్గురు, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications