అమరావతిలో మళ్లీ భూసేకరణపై యూటర్న్? నారాయణ క్లారిటీ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంకా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం కోసం చేస్తున్న ప్రయత్నాలు పట్టాలెక్కడం లేదు. ఇలాంటి సమయంలో రాజధానిలో మరో విడత భూసమీకరణ కోసం ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ప్రభుత్వం మరోసారి భూసేకరణపై వెనక్కి తగ్గింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు.
అమరావతిలో మరోసారి భూసేకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ ప్రకటించారు. ..ఐదువేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు. దానికోసం భూమి అవసరం ఉందన్నారు. అయితే భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే రైతులు నష్టపోతారనే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు.

మంగళగిరి,తాడేపల్లి,గుంటూరు,విజయవాడను కలిపి త్వరలో మెగాసిటీ ఏర్పాటుచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నారని , అందుకే అంతర్జాతీయ స్థాయి విమనాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటే కేవలం రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందన్నారు.
రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ ను కోరుకుంటున్నారని అన్నారు. భూసమీకరణ ద్వారా ఎయిర్ పోర్ట్ కోసం ముప్పై వేల ఎకరాలు సమీకరించాల్సి ఉంటుందన్నారు.వీటిలో రైతులకు రిటర్నబుట్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు,డ్రెయిన్లు,ఇతర మౌళిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందన్నారు. ఇవన్నీ పోగా ఇంకా ఐదువేల ఎకరాలు మాత్రమే మిగులుతుందన్నారు. అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
అయినప్పటికీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ విషయంలో భూసమీకరణ లేదా భూసేకరణ అనేది ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. అమరావతి నిర్మాణం కోసం 2015లో కేవలం 58 రోజుల్లోనే రైతులు స్వచ్చందంగా 34 వేల ఎకరాలు భూమిని పూలింగ్ ద్వారా ఇచ్చారనే విషయాన్ని మంత్రి గుర్తు చేసారు. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారని... అయితే గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారని అన్నారు. అయితే డ్రోన్ సర్వే ద్వారా ఎంత లోతు వరకూ తవ్వారనే దానిపై స్పష్టత తీసుకుంటామన్నారు. ఇక్కడ ఖాళీగా ఉన్న భూమిని కూడా ఏదొక అవసరానికి ఉపయోగించాలని చూస్తున్నామన్నారు...
రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. నిర్ధిష్ట కాలపరిమితితో పనులు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. ఏడాదిలో అధికారుల నివాస భవనాలు పూర్తి చేస్తామన్నారు. ఏడాదిన్నరలో ట్రంక్ రోడ్లు,రెండున్నరేళ్లలో లేఅవుట్ రోడ్లు,మూడేళ్లలో ఐకానిక్ భవనాలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications