jagan supreme court amaravati land scam cji ysrcp జగన్ సుప్రీంకోర్టు అమరావతి భూకుంభకోణం సీజేఐ వైసీపీ politics
జగన్‌కు దిమ్మతిరిగే షాక్: జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదును కొట్టేసిన సుప్రీంకోర్టు -సంచలన వ్యాఖ్యలు
న్యాయవ్యవస్థ ప్రతిష్టను చర్చకు పెడుతూ, దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన 'జడ్జిలపై జగన్ ఫిర్యాదు' వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎట్టకేలకు స్పందించింది. అమరావతి భూకుంభకోణానికి సంబందించి సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ, మరికొందరు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదుపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని బుధవారం వెల్లడించింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును సిట్టింగ్ సీజేఐ జస్టిస్ బోబ్డే కేంద్రానికి ప్రతిపాదించిన కొద్ది గంటల్లోనే ఫిర్యాదు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది.
న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

జగన్ ఫిర్యాదు కొట్టివేత..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాటి చంద్రబాబు హయాంలో భారీ భూకుంభకోణం జరిగిందని, ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం జరిపిన దర్యాప్తులో ఆధారాలు కూడా లభ్యమయ్యాయని, అయితే, సదరు విచారణ ముందుకు సాగకుండా ఏపీ హైకోర్టులోని కొందరు జడ్జిలు అడ్డుపడుతున్నారని, వాళ్లందరికీ సుప్రీం జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ గతేడాది అక్డోబర్ 6న సీజేఐ బోబ్డేకు అఫిడవిట్ రూపంలో ఎనిమిది పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా, సదరు ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు..
ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

అంతర్గత విచారణ తర్వాతే..
అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో జస్టిస్ ఎన్వీ రమణ పాత్రపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదును అంతర్గతంగా పరిశీలించి, విచారించిన తర్వాతే దానిని కొట్టేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్ లో పేర్కొంది. అదే సమయంలో జస్టిస్ రమణపై ఫిర్యాదు వ్యవహారంపై కోర్టులో అంతర్గతంగా సాగిన విచారణ తీరుతెన్నులు ఎప్పటికీ గోప్యంగానే ఉంటాయని, జనసామాన్యానికి వాటిని బహిర్గతపర్చే వీలుండదని సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన కొద్దిసేపటికే, ఆయనపై ఏపీ సీఎం చేసిన ఫిర్యాదుపైనా ప్రస్తుత సీజేఐ బోబ్డే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సుప్రీం స్టేట్మెంట్‌లో ఏముందంటే..
‘‘2020, అక్టోబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టుకు పంపిన ఫిర్యాదులను అంతర్గత విధానం(In-House Procedure)లో విచారించి, ఫిర్యాదును కొట్టేశాం. సుప్రీంకోర్టు అంతర్గత విధానంలో వ్యవహరించే అన్ని విషయాలు స్వభావరీత్యా గోప్యంగా ఉంటాయి. వాటిని బహిర్గతపర్చే ప్రకృతిలో ఖచ్చితంగా గోప్యంగా ఉంటాయి, వాటిని బహిరంగపరచడానికి కోర్టు బాధ్యత వహించదు'' అని బుధవారం నాటి స్టేట్మెంట్ లో సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇంతకీ ఏపీ సీఎం ఏమన్నారు?
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ.. ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, జస్టిస్ రమణకు మధ్య సాన్నిహిత్యం ఉందని, టీడీపీకి సంబంధించిన కేసుల విచారణల్లో హైకోర్టు న్యాయమూర్తుల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్)ను సుప్రీం జడ్జి జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారని, ఇది స్పష్టంగా కొందరు జడ్జిలు, జస్టిస్ ఎన్వీ రమణ, టీడీపీల మధ్య సంబంధాన్ని తెలుపుతోందంటూ ఏపీ సీఎం జగన్ గతేడాది అక్టోబర్ లో సీజేఐకి చేసిన ఫిర్యాదుల పేర్కొన్నారు. ఈ వ్యవహారం..

జగన్‌కు భారీ షాక్.. వివాదం ముగిసినట్లేనా?
సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జిలపై ఫిర్యాదు చేయడం ఒక ఎత్తయితే, ఆ ఫిర్యాదు లేఖలను మీడియాకు బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్ ది అసాధారణ చర్య అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఫిర్యాదు వెనుక రాజకీయ కోణాలపైనా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుప్రీం తన పవిత్రతను కాపాడుకోడానికి ఇదొక అవకాశమని అన్నవాళ్లూ లేకపోలేదు. కాగా, ఐదు నెలల సుదీర్ఘ సమయం తర్వాత, అంతర్గత విచారణలో ఏపీ సీఎం ఫిర్యాదును కొట్టేశామంటూ సుప్రీంకోర్టు ప్రకటన చేయడం, అది కూడా తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరు దాదాపు ఖరారయ్యాకే ప్రకటన వెలువడటం గమనార్హం. ఈ పరిణామం ఏపీ సీఎంకు షాక్ లాంటిదని కొందరు అంటుంటే, ఇక వివాదం ముగిసిపోయినట్లేనని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సుప్రీంలో ఫిర్యాదు కొట్టివేతపై సీఎం జగన్ లేదా ఏపీ ప్రభుత్వం స్పందించాల్సిఉంది.