పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి.. ఇలా చేస్తే అన్నం మొత్తం లాగించేస్తారు!
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. వంటింట్లో మామిడికాయల సువాసనలు గుబాళిస్తాయి. మామిడికాయతో చేసే రకరకాల వంటకాల్లో "పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి" ఎంతో ప్రత్యేకమైనది. కేవలం పది నిమిషాల్లో, ఎలాంటి హడావుడి లేకుండా చేసుకోగలిగే ఈ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ తృప్తే వేరు.ఈ రోటి పచ్చడిని పక్కా పల్లెటూరి శైలిలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పచ్చి మామిడికాయ: 1 (పెద్దది - ముక్కలుగా కోసుకున్నవి)
పచ్చిమిర్చి: 8 నుండి 10 (మీ కారానికి తగినట్లు)
జీలకర్ర: 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 6-8
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 2 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు

తయారీ విధానం:
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చిని ముక్కలుగా తుంపి అందులో వేసి దోరగా వేయించాలి. పచ్చిమిర్చి వేగేటప్పుడే అందులో జీలకర్ర కూడా వేసి కాసేపు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించిన పచ్చిమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని చల్లార్చాలి. ఆ తర్వాత రోట్లో (లేదా మిక్సీ జార్‌లో) వేసి, వాటితో పాటు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్ట్
మామిడి ముక్కలు కలపడం: ఇప్పుడు అదే మిశ్రమంలో పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసి మరీ మెత్తగా కాకుండా, కొంచెం ముక్కలు తగిలేలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి (మిక్సీ అయితే పల్స్ మోడ్‌లో ఒక్కసారి తిప్పాలి). పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకున్నాక.. అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.
పోపుతో పచ్చడికి అదనపు రుచి
చివరగా కొద్దిగా పసుపు, ఇంగువ వేసి, ఈ పోపును మామిడికాయ పచ్చడిలో కలిపేయాలి. అంతే.. నోరూరించే పచ్చిమామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి సిద్ధం. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లోకి కూడా నంజుకోవడానికి చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసి ట్రై చెయ్యండి.













Click it and Unblock the Notifications