దేశంలోకి చొరబాటుకు యత్నం.. నలుగురు పాకిస్థానీ టెర్రరిస్టులు హతం..
జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా ప్రాంతంలోని కేజీ సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు పాకిస్థానీ టెర్రరిస్టులు హతం అయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్ పేలడంతో ఉగ్రమూకలు తునాతునకలు అయ్యాయి. ఈ ఘటనతో నియంత్రణ రేఖ వెంబడి భద్రతా బలగాలను భారీగా మోహరించారు అధికారులు.
ఇక మృతి చెందిన నలుగురిలో లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ కూడా ఉన్నట్లు సమాచారం. హతమైన టెర్రరిస్టులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మాండ్లా, మదార్ పూర్, తెహసిల్ హాజీరా ప్రాంతాలకు చెందిన మహమ్మద్ ఇస్తియాక్, మహమ్మద్ ఫైజాన్(లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్), మహమ్మద్ వాఖాస్, మహమ్మద్ వాసిమ్ గా గుర్తించారు.
నియంత్రణ రేఖ వెంబడి సత్వాల్- నఖీ ప్రాంతం గుండా ఉగ్రమూకలు భారత్ లోకి చొచ్చుకొచ్చే క్రమంలో ల్యాండ్ మైన్ పేలడంతో ఉగ్రవాదులు హతం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాల మోహరింపును మరింత పెంచారు. గతంలోనూ ఈ ప్రాంతంలో ఆరు నుంచి ఏడుగురు పాకిస్థానీ టెర్రరిస్టులు ల్యాండ్ మైన్ పేలిన ఘటనలో హతం అయ్యారు.

ఇక మరో ఘటనలో మెందార్ సెక్టార్ లోని బసోనీ ప్రాంతంలో సోమవారం భారత ఆర్మీ దళాలు రెండు తుప్పుపట్టిన ల్యాండ్ మైన్స్ ను గుర్తించాయి. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాటిని వెంటనే నిర్వీర్యం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇక నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుదారులను నియంత్రించేందుకు ఇలాంటి ల్యాండ్ మైన్స్ ను ఏర్పాటు చేస్తుంటారు. అయితే భారీ వర్షాల కారణంగా వాటిపై ఉన్న మట్టి కొట్టుకు పోయి అవి బయట పడుతుంటాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాకిస్థాన్- భారత్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22 న పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత మే 7 నుంచి 10 వరకు పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
