రాళ్లేసి పూలల్లో ఉన్నాయన్నారు-రేపు బాంబులేసి !కర్నూల్లో అమరావతికి మద్దతు-చంద్రబాబు కామెంట్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి విరుచుకుపడ్డారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్రస్దాయి సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కర్నూలు టూర్ లో చోటు చేసుకున్న పరిణామాలతో పాటు మూడు రాజధానులకు సంబంధించి మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు బాంబుదాడి ముప్పు ఉందంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ పై చంద్రబాబు ఫైర్
మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో విధ్వంసం జరిగిందని చంద్రబాబు విమర్శించారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దారుణాలు జరిగాయన్నారు. పోలీసుల సహకారంతో ప్రభుత్వమే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందన్నారు.టీడీపీ జాతీయ ప్రత్యామ్నాయాల్లో కూడా కీలక పాత్ర పోషించిందని, అధికారంలో ఉన్నప్పుడే కాదు.. ప్రతిపక్షంలో కూడా అంతే బాధ్యతగా ఉన్నామన్నారు.
అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపిందని చంద్రబాబు ఆరోపించారు. ఓ ఫ్లెక్సీ తగులబడితే పోలీస్ డాగ్సును రంగంలోకి దింపారని, తునిలో టీడీపీ నేత మీద హత్యాయత్నం జరిగితే పోలీస్ డాగ్స్ ఏమయ్యాయని చంద్రబాబు ప్రశ్నించారు.
బాంబుదాడి ముప్పు ఉందన్న చంద్రబాబు
తన మీద రాళ్లేస్తే భయపడి పర్యటనలు చేయకూడదని ప్రభుత్వ ఉద్దేశ్యమని చంద్రబాబు కర్నూలు ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై పూలేస్తే ఆ పూలల్లో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారన్నారు. ఇవాళ పూలల్లో రాళ్లున్నాయన్నారు, రేపు పూలల్లో బాంబు ఉందని అంటారా అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు.కర్నూల్లో వచ్చిన స్పందన చూసి తనపై రాళ్లేశారన్నారు. రాష్ట్రం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను కానీ వెనక్కు పోనన్నారు.

కర్నూల్లోనూ అమరావతికి మద్దతు!
మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని కావాలని ఆదోని, ఎమ్మిగనూరు ప్రజలు ముక్త కంఠంతో నినదించారని చంద్రబాబు గుర్తుచేశారు. కర్నూల్లో హైకోర్టు కావాలని, విశాఖలో పరిపాలనా రాజధాని కావాలని గతంలో ఎందుకు అడగలేదని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎందుకు ఒప్పుకున్నారని అడిగారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడితే రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరన్నారు. టీడీపీ గెలుపు తన కోసం, పార్టీ నేతల కోసమో కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం మాత్రమేనన్నారు.












Click it and Unblock the Notifications