చంద్రబాబుతో భేటీ-బీజేపీకి విడాకులకు పవన్ రెడీ ! ఢిల్లీతో టచ్ లోకి సోము - ఏం జరగబోతోంది ?
ఏపీలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఇప్పటికే కలిసి పోరాటం చేస్తున్నా పైకి మాత్రం ఎవరికి వారుగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా విశాఖ ఘటనల నేపథ్యంలో చంద్రబాబు-పవన్ భేటీ రాజకీయాల్ని వేడెక్కించింది. ఇదే అదనుగా టీడీపీ-జనసేన పొత్తుకు రంగం సిద్దమవుతుండగా.. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్దితి అగమ్య గోచరంగా మారబోతోంది. దీంతో చివరి ప్రయత్నాలు చేసేందుకు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లే యోచనలో ఉన్నారు.

చంద్రబాబు-పవన్ భేటీ
ఏపీలో విపక్షనేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిన్న విజయవాడ నోవోటెల్ హోటల్లో నిర్వహించిన భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం అధికారపక్షమైన వైసీపీపై ఏమాత్రం ఉండబోతోందన్న చర్చ ఓవైపు సాగుతుండగా.. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ పరిస్ధితి ఏంటనే ప్రశ్నల్ని కూడా ఇది లేవనెత్తింది. దీంతో ఈ రెండు అంశాలపై రాష్ట్రంలోని రాజకీయ నాయకుల్లో, కార్యకర్తల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

బీజేపీని వదిలించుకోనున్న పవన్ ?
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్ధితుల్లో బీజేపీకి గుడ్ బై చెప్పేందుకు పవన్ కళ్యాణ్ రంగం సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిన్న మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ దీనిపై సంకేతాలు ఇచ్చేశారు. బీజేపీని వదిలించుకోవడం ఖాయమేనన్న సంకేతాలు ఇచ్చిన పవన్.. దానిపై ఫుల్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.దీంతో కాస్త సస్పెన్స్ నెలకొన్నా అంతిమంగా గుడ్ బై చెప్పడం తప్పదనిపిస్తోంది. దీని వెనుక పలు కీలక కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది వైసీపీ-బీజేపీ బంధం.

ఢిల్లీతో సోము చర్చలు ?
రాష్ట్రంలో మారుతున్న రాజకీయపరిస్దితుల నేపథ్యంలో విశాఖ ఘటనల తర్వాత పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... విజయవాడలోనూ కలిశారు. ఈ భేటీలో బీజేపీ-జనసేన సంబంధాలపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం పవన్ కళ్యాణ్ బీజేపీ తాను అనుకున్న విధంగా ముందుకు రాకపోవడంతో తన రూటు మార్చుకుంటున్నట్లు తేల్చేశారు. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ దూకుడుపై ఆయన బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపబోతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీని పవన్ ఎందుకు వదిలేస్తున్నట్లు ?
రాష్ట్రంలో మూడేళ్లుగా బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతోంది. అయినా ఇరుపార్టీల నేతలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అన్నింటికంటే మించి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తమ రాజకీయ అవసరాల కోసం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని వాడుకుంటూ ప్రతిగా మద్దతిస్తోంది. కేవలం అమరావతి విషయంలో మినహా కేంద్రం వైసీపీ వైఖరికి భిన్నంగా వెళ్లింది లేదు. దీంతో బీజేపీ అధిష్టానం రూటు మార్చుకుని తమతో కలిసి వస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్.. తగిన సహకారం లేకపోవడంతో ఇక కమలానికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై సోముకు కూడా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అదే విషయం ఢిల్లీ పెద్దలకు చెప్పేందుకు వెళ్లారు. అయితే తెలంగాణలో టీడీపీ అవసరం బీజేపీకి ఉన్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ-జనసేనకు వదిలిపెట్టి, తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications