ఏపీలో ఆగస్టు1 నుంచి ఉచిత బియ్యం పంపిణీ..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బియ్యం పంపిణీ పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేయకుంటే...ధాన్యం సేకరణ నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల పైన ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ అంశం పైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1 నుంచి కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
దీనికి సంబంధించి ఇప్పటికే రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోని కార్డు దారులకు ఈ పధకం అమలు కాలనుంది. ఏపీలో మొత్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డుల్లో 88.75 లక్షల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డు దారులకు ఉచిత బియ్యం అందనున్నాయి. ఆగస్టు 1 నుంచి ఉచిత బియ్యం పంపిణీపైన ఇప్పటికే మార్గదర్శకాలు సిద్దమయ్యాయి. అందులో భాగంగా.. కార్డుదారుల జాబితాలను గ్రామ రెవెన్యూ అధికారి వద్ద ఉంచుతున్నారు. రెండు రోజుల ముందు వాలంటీర్ల ద్వారా కార్డు దారులకు సమాచారం ఇస్తారు. జులై 25వ తేదీ నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు చేరుతుంది.

30వ తేదీ లోగా రేషన్ దుకాణాలకు బియ్యం చేరవేయటం ద్వారా .. ఒకటో తేదీ నుంచి పంపిణీ ప్రారంభం కానుంది. పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని 88.75 లక్షల రేషన్ కార్డులకు నెలకు 1.34 లక్షల టన్నుల ఉచిత బియ్యం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం 5 నెలలకు కనీసం 6 లక్షల టన్నుల బియ్యం అవరమవుతాయని లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో నిల్వలు సిద్దంగా లేవు. దీంతో..కూపన్లు ఇచ్చి విడతల వారీగా అమలు చేసే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బియ్యం పంపిణీ ..నిర్ణయాల పైన సోమవారం మంత్రులు అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications